ఎండలు కాదు ముంచెత్తె వానలు.. ఈ నెలలో దంచికొట్టుడే.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

ఎండలు కాదు ముంచెత్తె వానలు.. ఈ నెలలో దంచికొట్టుడే.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..


భారత్ ఈ ఏడాది అసాధారణమైన వాతావరణ మార్పులకు సాక్ష్యంగా నిలవనుంది. సాధారణంగా మే నెల అంటే భానుడి భగభగలు, వడగాలులతో అల్లాడిపోయే ప్రజలకు ఈసారి వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. 2026 మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎమ్‌డి అంచనా వేసింది. ఈ వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే 110 శాతానికి పైగా మించి ఉంటుందని వెల్లడించింది.1971 నుండి 2020 మధ్య నమోదైన డేటా ప్రకారం.. మే నెలలో దేశవ్యాప్త సగటు వర్షపాతం 64.1 మి.మీ. అయితే ఈ ఏడాది దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. ఇది పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా వేసవి ఆరంభంలో వచ్చే తీవ్రమైన వడగాలుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వడగాలుల స్థానంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని చోట్ల వరదలు.. మరికొన్ని చోట్ల కరువు

దేశవ్యాప్తంగా వర్షాలు ఉన్నప్పటికీ, వాటి పంపిణీ ఏకరీతిగా ఉండదు. వాయువ్య, మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. తూర్పు, ఈశాన్య భారత్, అలాగే తూర్పు-మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతీయ అసమతుల్యత వేసవి పంటలపై, నీటిపారుదలపై ఆధారపడే వ్యవసాయంపై ప్రభావం చూపవచ్చు.

మే 3 నుండి మే 6 వరకు అప్రమత్తం

ఐఎమ్‌డి పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. మే 5 వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది. మే 3 నుండి మే 6 మధ్య పశ్చిమ హిమాలయ ప్రాంతం, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నిపుణుల హెచ్చరిక

వసంతకాలం ముగిసి, నైరుతి రుతుపవనాలు ప్రవేశించే ముందు ఇలాంటి తుఫాను వాతావరణం సహజమేనని, అయితే ఈసారి వర్షాల తీవ్రత, పరిమాణం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో కురిసే భారీ వర్షాల వల్ల పంట నష్టం మరియు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, చేతికి వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని మరియు తాజా ఐఎమ్‌డి అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని సూచించడమైనది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *