పాఠాలు చెప్పే గురువులు అప్పుడప్పుడు విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాలుపంచుకుంటే ఆ సందడే వేరు. తాజాగా ప్రకాశం అద్దంకిలో అలాంటి దృశ్యమే కనిపించింది. కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు తన డ్యాన్స్‌తో దుమ్ములేపారు. విద్యార్థుల కోసం ఆయన స్టేజ్ ఎక్కి వేసిన స్టెప్పులు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ప్రకాశం జిల్లా అద్దంకి కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు . సాధారణంగా పరిపాలన, క్రమశిక్షణతో బిజీగా ఉండే ప్రిన్సిపాల్ .. విద్యార్థులలో ఎంటర్టైన్మెంట్ నింపేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. మాస్ బీట్స్‌కు ఆయన వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.
కేవలం చదువే కాదు, విద్యార్థుల సృజనాత్మకతను, ఉత్సాహాన్ని ప్రోత్సహించడంలో తానే ముందుంటానని మోహన్ రావు నిరూపించారు. ప్రిన్సిపాల్ తమతో కలిసి ఇలా డ్యాన్స్ చేయడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన ఒక ప్రిన్సిపాల్, వార్షోకోత్సవ వేడుకల్లో డాన్స్ ఇరగదీయడం విద్యార్దుల్లో కొత్త జోష్ నింపింది.