Headlines

డీలిమిటేషన్ బిల్లులో 6 సంచలన ప్రతిపాదనలు.. మన తెలుగు రాష్ట్రాలకు ఎన్ని సీట్లు?


దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికేలా డీలిమిటేషన్ బిల్లులో కీలక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. పార్లమెంట్ సభ్యులకు బిల్లు ప్రతులు అందడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఈ ప్రతిపాదనల్లో ప్రధానమైనవి. అయితే రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించాలన్న ప్రతిపాదన కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు

కొత్త ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 850కి పెరగనుంది. ఇందులో రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అయితే ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న స్థానాలతో పోలిస్తే 50 శాతం పెంపు ప్రతిపాదించారు.

అసెంబ్లీల్లోనూ భారీ మార్పులు

రాష్ట్రాల శాసనసభల్లోనూ సభ్యుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 500గా ఉన్న అసెంబ్లీ గరిష్ఠ సభ్యుల పరిమితిని 650కి పెంచాలని ప్రతిపాదించారు. ప్రతి రాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రస్తుత స్థానాల సంఖ్యపై 50 శాతం పెంపు ఉంటుంది. ఈ మార్పుతో ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ బలం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్

ఈ బిల్లులో అత్యంత కీలకమైన అంశం మహిళా రిజర్వేషన్. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు అంటే 33 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు కూడా ఇందులో ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదన ఉంది. రిజర్వ్ చేసిన స్థానాలను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించే విధానం ప్రకారం రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం ఈ కోటా 15 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా ప్రతిపాదించారు.

2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తికి రక్షణ

డీలిమిటేషన్ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని మరో కీలక ప్రతిపాదన చేశారు. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అంటే సీట్ల సంఖ్య పెరిగినా రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తిలో మార్పు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు ప్రాతినిధ్య పరంగా నష్టం జరగకుండా చూడాలన్నది దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన

కొత్త బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. చట్టం అమల్లోకి వచ్చే సమయానికి అందుబాటులో ఉన్న తాజా ప్రచురిత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించనున్నారు. మహిళా రిజర్వేషన్ అమలుకు అనుగుణంగా కొత్త నియోజకవర్గాలను రూపొందించడం కమిషన్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.

మొత్తంగా ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీల్లో సభ్యుల సంఖ్య పెరగడంతో పాటు మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం విస్తరించనుంది. అయితే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించాల్సి ఉంది. ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడం కీలకం. ఈ పరిణామాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ చర్చ మరింత వేడెక్కే అవకాశముంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *