రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయో చెప్పడం కష్టం. రాజస్థాన్లో జరిగిన ఓ పంచాయతీ సమితి ఎన్నిక ఇందుకు ఆసక్తికర ఉదాహరణగా నిలిచింది. కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలు ఒకే మహిళకు మద్దతు తెలపడం అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మూడు వేర్వేరు నామినేషన్లు దాఖలు చేసిన ఆమె.. చివరకు బీజేపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో ఉన్న బ్రిజ్ నగర్ పంచాయతీ సమితి ప్రధాన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బాటి కుమారి గుర్జర్ ఈ అరుదైన రాజకీయ పరిణామానికి కేంద్రబిందువుగా నిలిచారు. ఆమె గతంలో 14వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రధాన్ పదవికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా మూడు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ నామినేషన్ల సందర్భంగా ఆమె వేర్వేరు దుస్తుల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఎరుపు రంగు చీరలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాజిబ్ అలీతో కలిసి వచ్చారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించే సమయంలో పసుపు రంగు చీరలో రాజస్థాన్ హోంశాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బెధమ్తో కనిపించారు. స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి సల్వార్-కుర్తాలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే దుస్తులు మార్చుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటనేది అధికారికంగా వెల్లడికాలేదు.
నామినేషన్లపై ఆర్ఓ వివరణ
ఒకే ఎన్నికకు పలుమార్లు నామినేషన్లు దాఖలు చేయడంపై రిటర్నింగ్ అధికారి దుర్గా ప్రసాద్ మీనా వివరణ ఇచ్చారు. బాటి కుమారి గుర్జర్ మూడు నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు ధృవీకరించారు. వర్తించే ఎన్నికల విధానం ప్రకారం చివరిగా సమర్పించిన చెల్లుబాటు అయ్యే నామినేషన్ను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఆమె బీజేపీ అభ్యర్థిగా గుర్తింపు పొందారు.
బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ కమలం గుర్తుపై ఆమె బ్రిజ్ నగర్ పంచాయతీ సమితి ప్రధాన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమె చివరకు బీజేపీ తరఫున అత్యున్నత స్థానాన్ని దక్కించుకోవడం ఈ ఘటనలో ప్రత్యేకతగా నిలిచింది.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం
ఇదిలా ఉండగా, రాజస్థాన్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. 37 ఉపజిల్లా ప్రముఖ్ పదవుల్లో కాంగ్రెస్ 25 స్థానాలు గెలుచుకోగా, బీజేపీకి ఎనిమిది, భారత్ ఆదివాసీ పార్టీకి మూడు, ఆర్ఎల్పీకి ఒక స్థానం దక్కింది. పంచాయతీ సమితి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 3,701 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 2,181 స్థానాలకే పరిమితమైంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 599 స్థానాలు, బీజేపీ 301 స్థానాలు గెలుచుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..