Headlines

జగన్నాథుడి నవకళేబర రహస్యం.. ఆ సమయంలో పూరీ నగరమంతా చీకట్లోకి ఎందుకు వెళ్తుందో తెలుసా?


Puri Jagannath Nabakalebara Mystery: సాధారణంగా ఆలయాల్లో ఒకసారి విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత శతాబ్దాల పాటు వాటికే పూజలు నిర్వహిస్తారు. కానీ, ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాత్రం ఇందుకు భిన్నమైన, అత్యంత విశిష్టమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ కొలువైన మహాప్రభు జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి నిర్ణీత కాలం తర్వాత పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తారని భక్తుల విశ్వాసం. ఈ అరుదైన సంప్రదాయాన్ని ‘నవకళేబరం’ అంటారు.

నవకళేబరం అంటే ఏమిటి?

నవకళేబరం అంటే కొత్త శరీరాన్ని ధరించడం అని అర్థం. సాధారణంగా 12 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఒకసారి, హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో అధిక మాసం వచ్చినప్పుడు ఈ ప్రత్యేక క్రతువును నిర్వహిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇదే తత్వాన్ని ఈ సంప్రదాయం ప్రతిబింబిస్తుందని భక్తులు భావిస్తారు.

కొత్త విగ్రహాల కోసం పవిత్ర వృక్షాల అన్వేషణ

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను సాధారణంగా వేప కలపతో తయారు చేస్తారు. అయితే ఏ వేపచెట్టును పడితే ఆ చెట్టును ఎంపిక చేయరు. ప్రత్యేక లక్షణాలు కలిగిన పవిత్ర వృక్షాలను అన్వేషిస్తారు. వీటిని ‘దారు బ్రహ్మ’ అని పిలుస్తారు. చెట్లపై శంఖం, చక్రం, గద, పద్మం వంటి దైవిక చిహ్నాలు ఉండాలని సంప్రదాయం చెబుతుంది. ఆలయ సేవకులు, దైతాపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ వృక్షాలను గుర్తిస్తారు.

ఇవి కూడా చదవండి



బ్రహ్మ పదార్థం.. అత్యంత రహస్యమైన ఘట్టం

నవకళేబరంలో అత్యంత కీలకమైన ఘట్టం బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మార్చడం. ఈ ప్రక్రియను అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో బ్రహ్మ పరివర్తన ప్రక్రియ ఎవరూ చూడకూడదనే నియమం ప్రకారం ఆ రాత్రి పూరీ నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఆలయంలో పూర్తి చీకటి ఉండేలా చూస్తారు. దైతాపతులు కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు ప్రత్యేక వస్త్రాలు ధరించి ఈ క్రతువును పూర్తి చేస్తారని ప్రతీతి. బ్రహ్మ పదార్థం స్వరూపం ఏమిటనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.

పాత విగ్రహాలకు భూసమాధి

కొత్త విగ్రహాల్లో బ్రహ్మ పదార్థాన్ని ప్రతిష్ఠించిన తర్వాత పాత విగ్రహాలను పూరీ ఆలయంలోని కోయిలి వైకుంఠం అనే పవిత్ర ప్రదేశంలో సంప్రదాయబద్ధంగా భూసమాధి చేస్తారు. ఈ విధంగా నవకళేబరం సంప్రదాయం కేవలం విగ్రహాల మార్పు మాత్రమే కాదు. శరీరం నశించినా ఆత్మ శాశ్వతమనే ఆధ్యాత్మిక తత్వాన్ని చాటిచెప్పే అద్భుతమైన ఆచారంగా భక్తులు భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న నవకళేబరం సంప్రదాయం, బ్రహ్మ పదార్థం తదితర అంశాలు ఆలయ ఆచారాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా వివరించబడ్డాయి. వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాల కోణంలో మాత్రమే చూడగలరు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *