Headlines

తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు.. ఖేలో ఇండియాలో తొలిసారి కర్రసాము పోటీలు


చేతిలో వెదురు కర్ర.. కళ్లలో ఏకాగ్రత.. కదలికల్లో మెరుపు వేగం.. కర్రను గిరగిరా తిప్పుతూ చేసే విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో పండుగలు, జాతరల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కర్రసాము ఇప్పుడు జాతీయ క్రీడా వేదికపైకి చేరుతోంది. డిసెంబరు 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తొలిసారిగా కర్రసాము పోటీకి చోటు దక్కింది. దేశం నలుమూలల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళను పరిచయం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హకీంపేటలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఆటే కాదు.. ఆత్మరక్షణ కళ

కర్రసాముకు తెలంగాణ గ్రామీణ జీవితంతో విడదీయరాని అనుబంధం ఉంది. పూర్వం గ్రామీణులు ఆత్మరక్షణ కోసం ఈ కళను నేర్చుకునేవారు. క్రమంగా పండుగలు, జాతరలు, ఊరేగింపుల్లో కర్రసాము విన్యాసాలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను కర్రసేవగా పిలుస్తారు. కర్రసాములో రాణించేందుకు శారీరక బలం ఒక్కటే సరిపోదు. చురుకుదనం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి ఎంతో ముఖ్యం. చేతులు, కాళ్ల కదలికల్లో సమన్వయం ఉండాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకుంటూ విన్యాసాలు చేయగలగాలి. నిరంతర సాధనతోనే ఈ కళలో పట్టు సాధించగలరు.

కర్రసాముకు ఖరీదైన క్రీడా పరికరాలు, భారీ మైదానాలు అవసరం లేదు. గ్రామాల్లోనే పిల్లలకు శిక్షణ ఇవ్వొచ్చు. చిన్నతనం నుంచే సాధన చేయడం వల్ల శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. బాలబాలికలకు వ్యాయామంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది.

అలంకారం.. యుద్ధం

కర్రసాములో ప్రధానంగా రెండు రకాల ప్రదర్శనలుంటాయి. ఒకటి అలంకారం.. మరొకటి యుద్ధం. అలంకార ప్రదర్శనలో ఒక్కో క్రీడాకారుడు కర్రతో వివిధ రకాల విన్యాసాలు చేస్తారు. విన్యాసాల్లో వేగం, నేర్పు, శరీర కదలికల్లో సమన్వయం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. యుద్ధ ప్రదర్శనలో ఇద్దరు క్రీడాకారులు తలపడతారు. నిర్ణీత నియమాలకు లోబడి తమ నైపుణ్యాన్ని చాటుతారు. హకీంపేట క్రీడా పాఠశాలలో జరిగే కర్రసాము ప్రదర్శనల ద్వారా ఈ రెండు రూపాలను దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు పరిచయం చేయనున్నారు. ఈసారి కర్రసామును ప్రదర్శన క్రీడగానే చేర్చారు. పతకాల కోసం పోటీలు ఉండవు.

దేశీయ క్రీడలకూ పెద్దపీట

దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంప్రదాయ క్రీడలకు ఖేలో ఇండియాలో ప్రాధాన్యమిస్తున్నారు. మహారాష్ట్రలో మల్లఖంబ్‌, కేరళలో కలరిపయట్టు, పంజాబ్‌లో గత్కా, మణిపుర్‌లో థాంగ్‌–టా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఖేలో ఇండియా పోటీలతో ఈ క్రీడలు ఆయా రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా యువతకు పరిచయమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ కర్రసాముకూ ఆ అవకాశం దక్కింది.

ఈసారి ఖేలో ఇండియాలో మల్లఖంబ్‌లో 9, కలరిపయట్టు, థాంగ్‌–టా, యోగాసనలో ఎనిమిది చొప్పున, గత్కాలో ఆరు ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఐదు సంప్రదాయ క్రీడల్లో కలిపి 39 ఈవెంట్లు ఉన్నాయి. దేశీయ, గ్రామీణ, గిరిజన క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆయా క్రీడలకు అవసరమైన సామగ్రిని సమకూర్చడం, శిక్షణ సదుపాయాలు కల్పించడం, శిక్షకులను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది.

కర్రసాముపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

తెలంగాణ సంప్రదాయ క్రీడలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖేలో ఇండియా ఏర్పాట్లపై ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కర్రసాము ప్రత్యేక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ క్రీడలకు హాజరయ్యే క్రీడా నిపుణులు, శిక్షకులు, వివిధ రాష్ట్రాల క్రీడా సంఘాల ప్రతినిధులు కర్రసాము విశిష్టతను తెలుసుకునేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడతాయి. గ్రామాల్లో కర్రసాములో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి వారి ద్వారా యువతకు శిక్షణ ఇప్పించవచ్చు. క్రమం తప్పకుండా ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తే ఈ కళకు మరింత ఆదరణ పెరిగే అవకాశముంది.

బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లోని క్రీడా వారసత్వాన్ని దేశానికి చాటే అవకాశం వచ్చింది. నిన్నటివరకు ఊరి జాతరల్లో కనువిందు చేసిన కర్రసాము.. రేపు జాతీయ క్రీడా వేదికపై అలరించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *