Headlines

బీచ్ లవర్స్‌కు స్వర్గధామం.. గోవా, వైజాగ్ కాదు.. ఇండియా‌లో అతి పొడవైన బీచ్ ఇదే !


సముద్ర తీరమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అలల సవ్వడి, చల్లని గాలి, ఇసుక తిన్నెలపై నడక మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఇక మన దేశ విషయానికి వస్తే సుమారు 7,500 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ తీరరేఖ కలిగిన భారత్‌లో ఎన్నో అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయి. గోవాలోని పార్టీ బీచ్‌ల నుంచి కేరళలోని ప్రశాంతమైన తీరాల వరకు.. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి అండమాన్ దీవుల వరకు ప్రతి తీరానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే వీటన్నింటిలో విస్తీర్ణం, పొడవు పరంగా ఒక బీచ్ మాత్రం ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. భారతదేశంలోనే అతి పొడవైన బీచ్ గా పేరొందిన ఆ సముద్రం ఏది ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

మెరీనా బీచ్..

తమిళనాడు రాజధాని చెన్నైలోని ‘మెరీనా బీచ్’. ఇది బంగాళాఖాతం తీరం వెంబడి కోరమాండల్ కోస్ట్‌లో సుమారు 12 నుంచి 13 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. ఉత్తరాన ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంతం నుంచి మొదలై.. దక్షిణాన ఫోర్‌షోర్ ఎస్టేట్ (బెసెంట్ నగర్ సమీపం) వరకు ఈ తీరం వ్యాపించి ఉంది. ప్రపంచంలోనే రెండో అతి పొడవైన అర్బన్ బీచ్‌గా మెరీనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణంగా చాలా బీచ్‌లలో తీరం వెంబడి రాళ్లు, గులకరాళ్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం విశాలమైన, మృదువైన బంగారు రంగు ఇసుక తిన్నెలు కనువిందు చేస్తాయి. రోడ్డు నుంచి సముద్రపు నీటి అంచు వరకు కొన్ని చోట్ల దీని వెడల్పు ఏకంగా 437 మీటర్ల వరకు ఉండటం విశేషం. అందుకే ఉదయాన్నే బంగాళాఖాతం నుంచి ఉదయించే సూర్యుడిని చూడటానికి ఇక్కడికి వేలాది మంది తరలివస్తారు. సెలవు రోజుల్లో, పండుగ వేళల్లో రోజుకు సుమారు 30 వేల నుంచి 50 వేల మంది వరకు ఈ తీరానికి వస్తుంటారని అంచనా.

1880ల నాటి చరిత్ర.. చారిత్రక కట్టడాలు

మెరీనా బీచ్‌కు వందేళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. 1880లలో అప్పటి మద్రాస్ గవర్నర్ మౌంట్‌స్టువర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ గ్రాంట్ డఫ్ దీనిని పబ్లిక్ ప్రొమెనేడ్‌గా (నడక మార్గంగా) తీర్చిదిద్దారు. ఇటలీలోని సిసిలీ దీవిలో ఉన్న ‘పలెర్మో మెరీనా’ స్ఫూర్తితో ఆయనే దీనికి ‘మెరీనా’ అని పేరు పెట్టారు. బీచ్ రోడ్డు (కామరాజర్ సలై) పొడవునా ఎన్నో చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు కొలువుదీరాయి. మద్రాస్ యూనివర్సిటీ సెనేట్ హౌస్, చెపాక్ ప్యాలెస్, ప్రెసిడెన్సీ కాలేజీ, వివేకానంద హౌస్ వంటి అద్భుతమైన ఇండో-సార్సెనిక్ శైలి కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటితో పాటు మహాత్మా గాంధీ, తిరువళ్ళువర్, కన్నగి, సుభాష్ చంద్రబోస్, కామరాజర్ విగ్రహాలతో పాటు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి స్మారక మండపాలు (మెమోరియల్స్) ఇక్కడ ఉన్నాయి. దక్షిణ చివరన ఉన్న చెన్నై లైట్‌హౌస్ ఎక్కి చూస్తే నగర అందాలు, నీలి సముద్రం అద్భుతంగా కనిపిస్తాయి.

సముద్రంలో స్నానం నిషేదం..

అయితే మెరీనా బీచ్ చూడటానికి ఎంత ప్రశాంతంగా, అందంగా కనిపించినా సముద్రంలోకి దిగడం మాత్రం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ తీరం నుంచి కొద్ది దూరంలోనే లోతు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బలమైన అలలతో పాటు లోపల ఉండే అండర్ కరెంట్స్, రిప్ టైడ్స్ కారణంగా నీటిలోకి దిగిన వారిని సముద్రం లోపలికి లాగేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ కారణం గానే గతంలో జరిగిన పలు దుర్ఘటనల దృష్ట్యా ఇక్కడ స్విమ్మింగ్, సముద్ర స్నానాలను అధికారులు కఠినంగా నిషేధించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *