కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లి.. అరకేజీ మటన్ కీమా, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు కారం రుచికి సరిపడ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మాసాలా, పచ్చి మిర్చి, కొత్తిమీర, పూదీనా, నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసా పువ్వు, బిర్యానీ ఆకు.
తయారీలోకి వెళ్లితే..ముందుగా 400 గ్రాముల మటన్ కీమాను తీసుకొని శుభ్రంగా కడగాలి. అదనపు నీటిని తొలగించడానికి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టాలి. కీమాలో ఉండే కొవ్వు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి, తెల్లటి కొవ్వు భాగాలను తీసివేయడం మంచిది. గ్యాస్ ఆన్ చేసి, ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద ఉంచాలి. కుక్కర్లో కీమా త్వరగా ఉడికి, చాలా సాఫ్ట్‌గా అవుతుంది. మీరు కావాలంటే పాన్‌లో కూడా చేయవచ్చు, కానీ అప్పుడు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కుక్కర్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత, రెండు బిర్యానీ ఆకులు, చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలు, రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇందులోనే కొన్ని కరివేపాకులను కూడా యాడ్ చేయండి. చాలామంది కీమాలో కరివేపాకు వేయరు, కానీ కరివేపాకు వేయడం వల్ల కీమాకు అదనపు రుచి వస్తుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు బాగా వేయించాలి. నాన్-వెజ్ వంటకాలు చేసేటప్పుడు ఉల్లిపాయలను బాగా వేయించడం వల్ల మంచి రుచి వస్తుంది.
ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ కీమాను కుక్కర్లో వేసి, ఉల్లిపాయలు, మసాలా దినుసులతో బాగా మిక్స్ చేయాలి. కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు నూనెలోనే కీమాను ఉడికించాలి. దీనివల్ల కీమా బాగా కుక్ అవ్వడం ప్రారంభమవుతుంది. మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కీమా నుండి నీరు విడుదల అవుతుంది. ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు టీస్పూన్ల కారం , 3/4 టీస్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి బాగా మిక్స్ చేయాలి. టమాటాలు వేయడం వల్ల కీమా అసలు రుచి అంతగా తెలియదు కాబట్టి, ఈ రెసిపీలో టమాటాలు ఉపయోగించడం లేదు.
ఈ మసాలాల మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఆ తర్వాత, అర కప్పు వరకు నీటిని కలిపి, కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి గ్యాస్ ఆఫ్ చేసి, కుక్కర్లోని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూడండి. కీమా చక్కగా ఉడికి, మెత్తగా సిద్ధమవుతుంది. నీరు సరిగ్గా సరిపోతుంది. చివరిగా, కొత్తిమీర తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.




