Headlines

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అగంతకుడి చొరబాటు యత్నం.. CISF జవాన్ల మెరుపు యాక్షన్!


దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే విమానాశ్రయ టెర్మినల్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జవాన్లు అడ్డుకున్నారు. వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ IGI ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-3 డిపార్చర్ గేట్ వద్ద బుధవారం (నవంబర్ 18) ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే టెర్మినల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న CISF సిబ్బంది అతడి ప్రయత్నాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) రంగంలోకి దిగింది. CISF సిబ్బంది, QRT బృందం సమన్వయంతో క్షణాల్లోనే ఆ వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాశ్రయంలో సంభవించే అవకాశం ఉన్న భద్రతా ఉల్లంఘనను ముందుగానే నివారించగలిగారు.

ఈ ఘటనపై CISF ఎక్స్‌ (X) వేదికగా స్పందించింది. తమ సిబ్బంది అసాధారణ అప్రమత్తత, తక్షణ స్పందనతో అనధికార ప్రవేశ ప్రయత్నాన్ని భగ్నం చేశారని వెల్లడించింది. విమానాశ్రయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేసింది.

విమానాశ్రయంలో భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాన్నైనా ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సిద్ధంగా ఉంటారని CISF పునరుద్ఘాటించింది. అయితే పట్టుబడిన వ్యక్తి వివరాలు, అతడి ప్రవేశ ప్రయత్నం వెనుక కారణాలపై పూర్తి సమాచారం వెల్లడికావాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *