Headlines

భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్యదేవులకు ఏం జరిగిందో తెలుసా?


Gods Cursed by Their Wives Stories Telugu: హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో దేవదేవతలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. దేవతలు రాక్షసులను, మానవులను శపించిన సందర్భాలే కాకుండా.. స్వయంగా దేవుళ్లు కూడా శాపాలకు గురైన సంఘటనలు పురాణాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా తమ భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్ల గురించి కొన్ని పౌరాణిక కథలు చెబుతున్నాయి. వారే శనిదేవుడు, బ్రహ్మదేవుడు, సూర్యభగవానుడు. ఒకరి చూపు వినాశనానికి కారణమవుతుందని, మరొకరికి ఆలయాలు అరుదుగా ఉంటాయని, ఇంకొకరు వ్యాధి బారిన పడ్డారని ఈ కథల్లో ప్రస్తావించబడింది. ఇంతకీ ఈ ముగ్గురు దేవుళ్లకు వారి భార్యలు ఎందుకు శాపం ఇచ్చారు? ఆ కథల వెనుక ఉన్న పౌరాణిక విశేషాలు తెలుసుకుందాం.

1. శనిదేవుడిని భార్య ఎందుకు శపించింది?

పురాణ కథనాల ప్రకారం, శనిదేవుడి భార్య చిత్రరథుని కుమార్తె. ఆమెను ధమిష్ఠ లేదా మంద అని కూడా పిలుస్తారు. శనిదేవుడు చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడని, ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే గడిపేవాడని చెబుతారు. బ్రహ్మ పురాణంలో ప్రస్తావించిన కథనం ప్రకారం.. ఒకరోజు శనిదేవుడి భార్య సంతానం కావాలనే కోరికతో ఆయన దగ్గరకు వచ్చింది. అయితే ఆ సమయంలో శనిదేవుడు శ్రీకృష్ణుడి ధ్యానంలో పూర్తిగా నిమగ్నమై ఉండటంతో భార్య రాకను గమనించలేదు. చాలాసేపు ఎదురుచూసిన ఆమె తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురైంది. దీంతో కోపంతో శనిదేవుడిని శపించింది. ఇకపై ఆయన ఎవరిని చూసినా వారు నాశనమవుతారని శాపం ఇచ్చిందని కథనం. అప్పటి నుంచి శనిదేవుడి చూపును అశుభకరమైనదిగా భావిస్తున్నారని పౌరాణిక విశ్వాసం. అందుకే శనిదేవుడు తన చూపును ఎప్పుడూ కిందకు ఉంచుతాడని చెబుతారు.

2. బ్రహ్మదేవుడిని సావిత్రి ఎందుకు శపించింది?

బ్రహ్మదేవుడు, సావిత్రి (సరస్వతీ) దేవికి సంబంధించిన కథ పద్మ పురాణంలో కనిపిస్తుంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు రాజస్థాన్‌లోని పుష్కర క్షేత్రంలో గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. యజ్ఞ నియమాల ప్రకారం భార్య సావిత్రి కూడా ఆయన పక్కన ఉండాలి. అయితే యజ్ఞానికి నిర్ణయించిన శుభ ముహూర్తం సమీపించినా సావిత్రి అక్కడికి చేరుకోలేదు. దీంతో యజ్ఞం ఆగిపోకూడదనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు గాయత్రి అనే యువతిని వివాహం చేసుకుని ఆమెతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన సావిత్రి.. బ్రహ్మదేవుడి పక్కన మరో స్త్రీని చూసి తీవ్ర ఆగ్రహానికి గురైంది. కోపంతో భూలోకంలో బ్రహ్మదేవుడికి ఎక్కడా పూజలు జరగకూడదని శపించిందని పురాణ కథనం. ఈ శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్ బ్రహ్మ ఆలయం ఆయనకు అంకితమైన ప్రసిద్ధ క్షేత్రంగా గుర్తింపు పొందింది.

ఇవి కూడా చదవండి



3. సూర్యదేవుడిని ఛాయాదేవి ఎందుకు శపించింది?

పురాణాల ప్రకారం, సూర్యభగవానుడికి సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. శనిదేవుడు ఛాయాదేవి కుమారుడిగా చెబుతారు. ఒక పౌరాణిక కథనం ప్రకారం, సూర్యదేవుడు శనిదేవుడి ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉండేవాడు. ఒక సందర్భంలో శనిదేవుడిని, ఆయన తల్లి ఛాయాదేవిని తన నుంచి వేరుగా కుంభరాశిలో నివసించమని పంపించాడని కథనం. దీంతో ఛాయాదేవి తీవ్రంగా బాధపడింది. తన కుమారుడి పట్ల సూర్యదేవుడు చూపించిన వివక్షను భరించలేక ఆయనకు కుష్ఠు వ్యాధి సోకాలని శపించిందని చెబుతారు. ఆ శాపం కారణంగా సూర్యదేవుడు కుష్ఠు వ్యాధితో బాధపడ్డాడని, అనంతరం యమధర్మరాజును ప్రార్థించడంతో ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాడని పౌరాణిక కథలు వివరిస్తాయి. మొత్తానికి.. శనిదేవుడు, బ్రహ్మదేవుడు, సూర్యభగవానుడికి సంబంధించిన ఈ మూడు కథలు హిందూ పురాణాల్లో ఆసక్తికరమైన ఘట్టాలుగా నిలిచాయి.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు హిందూ పురాణాలు, పౌరాణిక గ్రంథాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తులు తమ తమ విశ్వాసాల ప్రకారం అర్థం చేసుకోవాలి.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *