Headlines

Andhra: ముసుగులో ఉన్న ముచ్చు ముఖంవోడు మాములు కంత్రీ కాదు.. ఇంటర్ బాలికను..


నమ్మకంగా ఉంటూ పరిచయం పెంచుకున్న ఓ ఆటోడ్రైవర్.. అదే అదనుగా చేసుకుని ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చెల్లెలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని నమ్మించి బాలికను ఆటోలో తీసుకెళ్లి అపహరించాడు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో దాచిపెట్టాడు. అయితే, పోలీసుల దర్యాప్తుతో అతడి వ్యవహారం బయటపడింది. చివరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

పరిచయాన్ని ఆసరాగా చేసుకుని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని వెంగళరావు నగర్‌కు చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. కుమార్తెలను ప్రతిరోజూ కాలేజీకి తీసుకెళ్లి, తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు కోడూరు సుబ్బారావు (40) అనే ఆటోడ్రైవర్‌ను నియమించుకున్నారు. ఈ క్రమంలో అతడికి విద్యార్థినులతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న సుబ్బారావు.. ఆగస్టులో ఇంట్లో పెద్ద కుమార్తె ఒక్కతే ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అనంతరం సెప్టెంబర్‌లో మరోసారి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సుబ్బారావు ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లికి చెబితే ఆమె చెల్లెలిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక భయపడి జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది.

తల్లి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి..

బాలిక భయాన్ని ఆసరాగా చేసుకున్న సుబ్బారావు ఈ నెల 11న మరో దారుణానికి పాల్పడ్డాడు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థినిని తల్లి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకెళ్లి, బస్సులో విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడ చంద్రశేఖర్ అనే తన స్నేహితుడి ఇంట్లో మూడు రోజుల పాటు బాలికను ఉంచాడు. అక్కడ ఆమెను తన కుమార్తెగా పరిచయం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సీసీ కెమెరాలతో బయటపడిన వ్యవహారం..

కాలేజీకి వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా.. బాలిక ఆటోడ్రైవర్ సుబ్బారావుతో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. అతడి ఫోన్ నంబర్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని హైదరాబాద్‌లో బాలికను గుర్తించారు. అనంతరం సుబ్బారావును అరెస్ట్ చేసి బాలికను సురక్షితంగా తీసుకొచ్చారు.

బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బెదిరింపులకు దిగిన నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పిల్లలతో ఎవరెవరు సన్నిహితంగా ఉంటున్నారు? ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *