Headlines

ICC: మరోసారి భారత్‌లో ప్రపంచ క్రికెట్ సందడి.. మెగా టోర్నీల తేదీలు ఖరారు


ICC: భారత క్రికెట్ అభిమానులకు ఐసీసీ తీపి కబురు చెప్పింది. 2029లో జరిగే పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఐసీసీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత్‌లో చివరిసారిగా 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా కూడా భారత్‌నే ఉంది.

2031 వన్డే ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌తో కలిసి

2031లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు ఈ టోర్నీ జరగనుంది. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ప్రపంచకప్ తర్వాత.. వన్డే క్రికెట్‌లో అతిపెద్ద టోర్నీ మళ్లీ ఉపఖండానికి రానుంది. 2023లో భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2031లో మరోసారి భారత్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.

2035 వరకు ఐసీసీ టోర్నీల షెడ్యూల్ ఇదే

పురుషుల ప్రధాన ఐసీసీ టోర్నీల నిర్వహణ తేదీలను 2035 వరకు ఐసీసీ ఖరారు చేసింది. 2028 టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 2030 టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జూలై 4 నుంచి ఆగస్టు 4 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. 2032, 2034 టీ20 ప్రపంచకప్‌ల తేదీలను ప్రకటించినా.. వేదికల వివరాలను మాత్రం వెల్లడించలేదు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కూడా ఖరారు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను రెండేళ్లకు ఒకసారి జూన్‌లో నిర్వహించే విధానం 2035 వరకు కొనసాగనుంది. 2029, 2031 ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2033, 2035 ఫైనల్స్ వేదికలను తర్వాత ప్రకటిస్తారు. ఇక 2033లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. అక్టోబర్ 2 నుంచి 23 వరకు ఈ టోర్నీ నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశారు. 2035 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 18 వరకు జరగనుంది. అయితే ఈ రెండు టోర్నీలకు ఆతిథ్య దేశాల పేర్లను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు.

లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం

2028లో అమెరికాలోని లాస్ ఏంజిలిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కానుంది. 128 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కనుంది. ఈ పోటీలకు అర్హత సాధించే పురుషుల జట్ల క్వాలిఫయర్‌ను బంగ్లాదేశ్‌లో 2028 ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మహిళల క్వాలిఫయర్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో జరగనుంది. ఈ పరిణామాలతో రాబోయే ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *