మనం ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు బస చేయడానికి హోటల్ రూమ్‌ను బుక్ చేసుకుంటాం. హోటల్‌కు వెళ్లాక లిఫ్ట్ ఎక్కి గది వైపు నడుస్తున్నప్పుడు లేదా లిఫ్ట్‌లోని బటన్లను గమనించినప్పుడు ఎప్పుడైనా మీకు వింతగా అనిపించిందా? చాలా అంతర్జాతీయ హోటళ్లలో, పెద్ద పెద్ద భవనాలలో 12వ అంతస్తు తర్వాత నేరుగా 14వ అంతస్తు వస్తుంది. 12వ నంబర్ గది పక్కనే 14వ నంబర్ గది కనిపిస్తుంది తప్ప 13 అనే అంకె మచ్చుకైనా కనిపించదు. అసలు హోటళ్లు, భవనాల నిర్మాణదారులు 13వ సంఖ్యను ఎందుకు దాటవేస్తారు? దీని వెనుక ఏదైనా దెయ్యాల కథ ఉందా లేక శాస్త్రీయ, సాంస్కృతిక కారణాలు ఉన్నాయా?
శతాబ్దాల మూఢనమ్మకాలు
హోటళ్లలో 13వ నంబర్ గది లేకపోవడానికి, భవనాలలో 13వ అంతస్తు కనిపించకపోవడానికి ప్రధాన కారణం శతాబ్దాలుగా పాతుకుపోయిన మూఢనమ్మకాలు, సాంస్కృతిక విశ్వాసాలే. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో 13వ సంఖ్యను తీవ్రమైన దురదృష్టానికి, అశుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏదైనా నెలలో 13వ తేదీ శుక్రవారం వస్తే, ఆ రోజున ఏ శుభకార్యం తలపెట్టకూడదని, బయటకు రావడం కూడా ప్రమాదకరమని పాశ్చాత్యులలో చాలామంది బలంగా నమ్ముతారు. ఈ భయం కారణంగా అమెరికా, ఐరోపా దేశాల్లోని దాదాపు 80 శాతానికి పైగా బహుళ అంతస్తుల భవనాలు, ప్రముఖ అంతర్జాతీయ హోటళ్లలో 13వ అంతస్తు లేదా 13వ నంబర్ గదిని ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తారు.
క్రైస్తవ సంప్రదాయం – చివరి విందు
13వ సంఖ్యను అశుభంగా భావించడానికి ప్రధాన కారణాలలో క్రైస్తవ మత విశ్వాసాలు ఒకటి. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం.. ఏసుక్రీస్తు తన శిష్యులతో కలిసి తీసుకున్న చివరి విందులో మొత్తం 13 మంది పాల్గొన్నారు. ఆ విందులో 13వ వ్యక్తిగా కూర్చున్న జుడాస్ ఇస్కరియోట్ చివరకు ఏసుక్రీస్తుకు వెన్నుపోటు పొడిచాడని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత రోజు శుక్రవారమే క్రీస్తును శిలువ వేశారు. ఈ కారణాల వల్ల పాశ్చాత్య సంస్కృతిలో 13వ సంఖ్య, శుక్రవారం కలయికను అరిష్టంగా ముద్రవేశారు. నార్స్ పురాణాల ప్రకారం కూడా ఇలాంటి కథే ప్రచారంలో ఉంది. వల్హల్లాలో 12 మంది దేవుళ్ల విందు జరుగుతున్నప్పుడు, ఆహ్వానం లేకుండా 13వ వ్యక్తిగా లోకీ ప్రవేశించి, దేవతలలో అత్యంత ప్రియమైన బాల్డర్‌ను చంపడానికి కారణమయ్యాడని నమ్ముతారు.
వైద్య పరిభాషలో దీని పేరు ట్రిస్కైడెకాఫోబియా
మనస్తత్వశాస్త్రంలో 13వ సంఖ్య పట్ల ప్రజలకు ఉండే తీవ్రమైన, హేతుబద్ధం కాని భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అని పిలుస్తారు. అలాగే ఫ్రైడే ది 13త్ పట్ల ఉండే భయాన్ని పారాస్కెవిడెకాట్రియాఫోబియా అంటారు. హోటల్ యాజమాన్యాలు అతిథుల మనస్తత్వాన్ని, వారి మానసిక సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటాయి. ఎవరైనా కస్టమర్ రూమ్ నంబర్ 13లో దిగినప్పుడు, అనుకోకుండా వారికి ఏదైనా అసౌకర్యం కలిగినా దాన్ని ఆ నంబర్ వల్లనే జరిగిందని భావించే అవకాశం ఉంది. ఇలాంటి మానసిక ఆందోళనలు తమ వ్యాపారాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే బిల్డర్లు, హోటల్ నిర్వాహకులు నేరుగా 13వ సంఖ్యను స్కిప్ చేసి 14 అని రాస్తుంటారు.
భారతదేశంలో పరిస్థితి ఏమిటి?
భారతదేశంలో స్థానిక వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలలో 13 సంఖ్యపై పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ, గ్లోబల్ టూరిజం ప్రభావంతో మన దేశంలోని మెట్రో నగరాలు, స్టార్ హోటళ్లలో కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. విదేశీ పర్యాటకులు, కార్పొరేట్ క్లయింట్లు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో దేశంలోని అనేక ఫైవ్ స్టార్ హోటళ్లలో 13వ అంతస్తు స్థానంలో 12A లేదా నేరుగా 14వ అంతస్తు అని బోర్డులు పెడతారు.
కాబట్టి మీరు ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు 12 తర్వాత నేరుగా 14వ నంబర్ కనిపిస్తే అక్కడ ఏదో రహస్యం దాగి ఉందని భయపడాల్సిన అవసరం లేదు. అది ప్రజల మూఢనమ్మకాలు, అతిథుల మనోభావాలను గౌరవిస్తూ హోటల్ యాజమాన్యాలు తీసుకునే ఒక తెలివైన బిజినెస్ నిర్ణయం మాత్రమే,