రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై అమెరికా కొత్త కొరడా ఝళిపించే పరిస్థితి వచ్చింది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే చట్టం అమల్లోకి వచ్చింది. భారత్, చైనా లాంటి పెద్ద దేశాలపై కూడా ఈ నిబంధన ప్రభావం చూపే అవకాశం ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. 100 శాతం సుంకం భారత్‌పై ఇప్పటికే పడిపోయిందని కాదు. ట్రంప్‌కు అలాంటి సుంకం విధించే అధికారం వచ్చింది. ఎవరిపై ఎంత సుంకం వేయాలి, ఏ వస్తువులపై వేయాలి అన్నది తర్వాతి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక వైపు భారత్‌కు రష్యా చమురు చౌకగా దొరుకుతోంది. మరో వైపు అమెరికా మనకు పెద్ద ఎగుమతి మార్కెట్. ఈ రెండింటి మధ్య సమతుల్యం కాపాడుకోవడం ఇప్పుడు భారత్‌కు పెద్ద పరీక్షగా మారింది.
100 శాతం సుంకం…
చాలామందికి ఇక్కడే ఒక అనుమానం వస్తోంది. అమెరికా 100 శాతం సుంకం వేస్తే భారత ప్రభుత్వం అమెరికాకు 100 శాతం డబ్బు కట్టాలా అంటే అలా కాదు. అమెరికాలోకి భారత వస్తువులు వెళ్లినప్పుడు అక్కడి దిగుమతిదారు ఆ సుంకాన్ని చెల్లిస్తాడు. ఆ తర్వాత ఆ భారం ఎవరి మీద పడుతుందనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. అమెరికా కంపెనీ భరించవచ్చు. భారత ఎగుమతిదారుతో ధర తగ్గించమని అడగవచ్చు. చివరికి అమెరికా వినియోగదారుడి మీద ధర పెరగవచ్చు. 2025లో అమెరికా భారత్ నుంచి దాదాపు 103.8 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. ఊహకు 100 శాతం సుంకం మొత్తం ఈ వస్తువులపై పడితే, సుంకం విలువ కూడా దాదాపు 103.8 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. కానీ ఇది కేవలం లెక్క కోసం వేసిన ఉదాహరణ. భారత్ నుంచి వచ్చే ప్రతి వస్తువుపై అంత సుంకం ఇప్పటికే పడిందని దీని అర్థం కాదు.
రష్యా చమురు ఎందుకు అంత ముఖ్యం
భారత్‌కు కావాల్సిన ముడి చమురులో పెద్ద భాగం విదేశాల నుంచే వస్తుంది. అందులో రష్యా ముఖ్యమైన సరఫరాదారుగా మారింది. ఆగస్టులో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురు కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 16 లక్షల బ్యారెళ్లు అంటే ఏడాదికి దాదాపు 58.4 కోట్ల బ్యారెళ్లు. ఒక్క బ్యారెల్ ధరను ఉదాహరణకు 70 డాలర్లు అనుకుంటే, ఏడాది చమురు విలువ దాదాపు 40.9 బిలియన్ డాలర్లు అవుతుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే చమురు ధరలో చిన్న మార్పు వచ్చినా దేశం ఖర్చు చేసే డబ్బులో భారీ మార్పు వస్తుంది. ఉదాహరణకు బ్యారెల్‌కు 10 డాలర్లు అదనంగా చెల్లించాల్సి వస్తే, 58.4 కోట్ల బ్యారెళ్లకు ఏడాదికి సుమారు 5.84 బిలియన్ డాలర్లు అదనపు భారం పడుతుంది. అంటే చమురు ధరలో చిన్న మంట కూడా దేశ ఖజానాపై పెద్ద వేడిని పెడుతుంది.
రష్యా చమురు తగ్గిస్తే ఏమవుతోంది..
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గిస్తే ఆ లోటును ఇంకెక్కడి నుంచో భర్తీ చేయాలి. మధ్యప్రాచ్యం, అమెరికా, ఇతర దేశాల నుంచి చమురు కొనాల్సి రావచ్చు. అక్కడ ధర ఎక్కువగా ఉంటే మన దిగుమతి బిల్లు పెరుగుతుంది. చమురు ఖరీదు పెరిగితే కథ అక్కడితో ఆగదు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి రావచ్చు. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, పరిశ్రమల ఖర్చులు పెరగొచ్చు. రవాణా ఖర్చు పెరిగితే సరుకుల ధరలపై కూడా ప్రభావం పడొచ్చు. అయితే చమురు ధర పెరిగిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్ ధరలు అదే స్థాయిలో పెరుగుతాయని చెప్పలేం. అంతర్జాతీయ ధరలు, రూపాయి విలువ, దేశీయ ధరల విధానం, చమురు కంపెనీల నిర్ణయాలు కూడా ఇందులో కీలకమే.
అమెరికా మార్కెట్ కూడా మనకు పెద్దదే
రష్యా చమురు ఒక వైపు ఉంటే అమెరికా మార్కెట్ మరో వైపు ఉంది. 2025లో అమెరికా భారత్ నుంచి సుమారు 103.8 బిలియన్ డాలర్ల వస్తువులు కొనుగోలు చేసింది. అదే సమయంలో భారత్ అమెరికా నుంచి సుమారు 45.4 బిలియన్ డాలర్ల వస్తువులు కొనుగోలు చేసింది. అంటే వస్తువుల వాణిజ్యంలో అమెరికా నుంచి భారత్‌కు వచ్చే దానికంటే అమెరికాకు మనం అమ్మేది ఎక్కువ. ఇప్పుడు అమెరికా భారత వస్తువులపై భారీ సుంకం పెడితే మన ఎగుమతిదారులకు ఇబ్బంది రావచ్చు. అమెరికాలో మన వస్తువుల ధర పెరుగుతుంది. ధర పెరిగితే అక్కడి కొనుగోలుదారులు ఇతర దేశాల వస్తువుల వైపు చూడొచ్చు. అప్పుడు మన ఎగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది.
మన ఎగుమతులు తగ్గితే
అమెరికాకు సరుకులు అమ్మి భారత్ డాలర్లు సంపాదిస్తుంది. ఆ ఎగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్య ఆదాయం మీద ఒత్తిడి రావచ్చు. అదే సమయంలో చమురు కోసం మనం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే మరో వైపు డాలర్ల అవసరం పెరుగుతుంది. ఇది రెండు వైపులా ఒత్తిడి లాంటిది. ఒక వైపు ఎగుమతుల నుంచి వచ్చే డాలర్లు తగ్గొచ్చు. మరో వైపు చమురు దిగుమతులకు వెళ్లే డాలర్లు పెరగొచ్చు. దీంతో రూపాయి మీద కూడా ఒత్తిడి రావచ్చు.
భారత్ ఏం చేయాలి
ఇప్పుడు వెంటనే రష్యా చమురు మొత్తం ఆపేయడం కూడా సరైన పరిష్కారం కాదు. అలాగే ఒక్క రష్యాపైనే ఆధారపడటం కూడా మంచిది కాదు. ఒక్క చెట్టుపై ఆధారపడితే నీడ పోయిన రోజు కష్టం. అందుకే చమురు కొనుగోళ్లలో దేశాల సంఖ్య పెంచుకోవాలి. రష్యా నుంచి కొనుగోలు చేస్తూనే మధ్యప్రాచ్యం, అమెరికా, ఇతర దేశాలతో కూడా సరఫరా మార్గాలు బలంగా ఉంచుకోవాలి. చౌకగా దొరికే చోట కొనాలి. కానీ ఒక్క దేశం మీద పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్త పడాలి. దేశంలో వ్యూహాత్మక చమురు నిల్వలను కూడా పెంచాలి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వచ్చినా, సరఫరా ఆగినా కొన్ని రోజులు మన అవసరాలు నడిచేలా నిల్వలు ఉండాలి.
అమెరికాతో చర్చలు
భారత్ అమెరికాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒత్తిడికి వెంటనే లొంగాల్సిన అవసరం కూడా లేదు. చర్చల ద్వారా రెండు దేశాలకు ఉపయోగపడే మార్గం చూడాలి. భారత్ అమెరికా నుంచి మరిన్ని వస్తువులు, ఇంధనం, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించవచ్చు. అదే సమయంలో భారత వస్తువులకు అమెరికా మార్కెట్ తెరిచి ఉండేలా చర్చలు జరపాలి. అంటే లెక్క సూటిగా ఉంది. మనం వాళ్ల దగ్గర కొంటే, వాళ్లు మన దగ్గర కొనడానికి కూడా మార్గం ఉండాలి. ఎగుమతులకు కొత్త దారులు కావాలి. అమెరికా మార్కెట్ చాలా పెద్దది. కానీ మన ఎగుమతులు ఒక్క అమెరికాపైనే ఆధారపడకూడదు. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో భారత వస్తువులకు మరిన్ని మార్కెట్లు వెతకాలి. ఒక మార్కెట్‌లో సమస్య వస్తే మరో మార్కెట్ ఆదుకునేలా వ్యవస్థ ఉండాలి. మన ఊళ్లలో రైతు ఒక్క పంటనే నమ్ముకోడు. ఒక పంట దెబ్బతింటే మరో పంట ఉండేలా చూసుకుంటాడు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అలాగే ఉండాలి.
సామాన్యుడికి భారం ఎక్కడ
చమురు ఖరీదైతే మొదట రవాణా ఖర్చుపై ప్రభావం పడొచ్చు. రవాణా ఖర్చు పెరిగితే సరుకుల ధరలపై ఒత్తిడి రావచ్చు. అమెరికా సుంకాలు పెరిగితే మరో సమస్య. అక్కడ భారత వస్తువులు ఖరీదవుతాయి. అమ్మకాలు తగ్గితే ఎగుమతి సంస్థల ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఎంత మేర జరుగుతాయో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే 100 శాతం సుంకం మొత్తం భారత వస్తువులపై అమలవుతుందా, ఏ వస్తువులపై పడుతుంది, భారత్ రష్యా నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తుంది, అంతర్జాతీయ చమురు ధర ఎలా ఉంటుంది అన్నది ముందున్న పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.
భారత్ ముందున్న సవాల్..
ఇది రష్యా లేదా అమెరికా అనే రెండు దేశాల్లో ఒకదాన్ని ఎంచుకునే విషయం కాదు.భారత్‌కు చౌకైన చమురు కావాలి. ఇంధన సరఫరా కూడా ఆగకూడదు. అమెరికా లాంటి పెద్ద మార్కెట్లలో మన ఎగుమతులు కూడా కొనసాగాలి. రూపాయి మీద ఒత్తిడి రాకూడదు. దేశంలో ధరలు అదుపులో ఉండాలి. ఈ అన్ని లెక్కలను ఒకేసారి చూసుకోవాలి. రెండు పడవల మీద కాలు పెడితే నది దాటలేమనే సామెత ఉంది. కానీ ఇక్కడ భారత్ చేయాల్సింది రెండు పడవల్లో ఒకదానిపైకి దూకడం కాదు. అవసరమైతే ఉపయోగించుకునేలా మరిన్ని పడవలను సిద్ధంగా ఉంచుకోవాలి.
చివరిగా..
అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను అవసరానికి తగ్గట్టు కొనసాగిస్తూనే, ఇతర దేశాల నుంచి కూడా సరఫరా మార్గాలు తెరిచి ఉంచుకోవాలి. అమెరికాతో చర్చలు కొనసాగించాలి. ఎగుమతులకు కొత్త మార్కెట్లు వెతకాలి. దేశీయ ఇంధన వనరులు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, ప్రజా రవాణాపై పెట్టుబడులు పెంచాలి. చివరికి భారత్‌కు కావాల్సింది ఒక్క దేశం మీద ఆధారపడే విధానం కాదు. చమురు ఎక్కడి నుంచైనా తెచ్చుకునే శక్తి, వస్తువులు ఎక్కడికైనా అమ్ముకునే మార్కెట్లు, సంక్షోభం వచ్చినా తట్టుకునే ఆర్థిక బలం. రష్యా చమురు ఒక వైపు. అమెరికా మార్కెట్ మరో వైపు.. మధ్యలో భారత ప్రయోజనం. ఇదే ఇప్పుడు భారత్ ముందున్న అసలు ఎనర్జీ పరీక్ష.
ప్రస్తుత చట్టం ట్రంప్‌కు 100% వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఇస్తోంది.. అయితే.. భారత్‌పై ఎంత సుంకం, ఎప్పుడు విధిస్తారనేది తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.