Headlines

తీవ్ర కుదుపుల మధ్య ల్యాండింగ్..తెరుచుకున్న లగేజ్ క్యాబిన్లు..మీద పడ్డ బ్యాగులు


అసలేం జరిగిందంటే.. ఇరాన్‌లోని సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మషద్‌ నుంచి కెర్మాన్‌షాకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం టైరు ఊడిపోయింది.  అదే సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. టేక్యాఫ్ సమయంలో టైరు పేలడం వల్ల శకలాలు ఇంజిన్‌లోకి వెళ్లి దానిని దెబ్బతీసి ఉండవచ్చని స్థానిక మీడియా తెలిపింది. ఒకే ఇంజిన్‌తో ప్రయాణం కొనసాగించడం ప్రమాదమని భావించిన పైలట్లు, వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి మషద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. మషద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఈ ధాటికి లగేజీ క్యాబిన్లు తెరుచుకుని బ్యాగులన్నీ ప్రయాణికులపై పడటంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురయ్యారు.

క్యాబిన్ లోపల భయానక వాతావరణం

విమానం సాంకేతికంగా నియంత్రణలోనే ఉన్నప్పటికీ, లోపల మాత్రం పరిస్థితులు భయానకంగా కనిపించాయి. ప్రయాణికులు పంచుకున్న వీడియోల్లో విమానం కుదుపులకు గురికావడం, తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణికులు కేకలు వేయడం కనిపించాయి. విపరీతమైన కుదుపు, ఒత్తిడిలో మార్పుల కారణంగా క్యాబిన్ లోపలి ఇంటీరియర్ ప్యానెల్స్ ఊడిపోయాయి.  అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ సర్వీసులను అప్రమత్తం చేయడంతో వారు ల్యాండింగ్ టార్మాక్ కు చేరుకున్నారు.

పైలట్లు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ల్యాండింగ్ సమయంలో లగేజీలు పడిపోవడంతో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స అందించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.  విమానంలో టైరు ఊడిపోవడానికి,  ఇంజిన్ సమస్య తలెత్తడానికి అసలు కారణం ఏమిటనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Newsmatic - News WordPress Theme 2026. Powered By BlazeThemes.