Headlines

Womens Asia Cup 2026: ఫైనల్‌కు చేరినా వీడని ఆందోళనలు.. ఆసియా కప్ నెగ్గాలంటే ఈ పొరపాట్లు రిపీట్ కాకూడదు


Womens Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం సాయంత్రం దుబాయ్ వేదికగా శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. రెండేళ్ల క్రితం దంబుల్లూ వేదికగా లంక చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి పగ తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది. అయితే తుది పోరుకు ముందు ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ బెర్తును దక్కించుకుంది. ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, జట్టు ప్రదర్శనలో అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో వైఫల్యాలు ఎదురవుతుండగా, బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్ తీవ్రంగా తడబడుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం జట్టును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోతుండటం వల్ల మిడిల్ ఆర్డర్‌పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.

మంధాన గణాంకాల వెనుక నిరాశ పరిచే నిజం

భారత జట్టు వైస్ కెప్టెన్, వైవిధ్యమైన షాట్లతో అలరించే స్మృతి మంధాన ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 154 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. పైకి ఈ గణాంకాలు ఎంతో మెరుగ్గా అనిపిస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఒక చేదు నిజం బయటపడుతుంది. మంధాన చేసిన 154 పరుగులలో ఏకంగా 124 పరుగులు హాంకాంగ్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ నుంచే వచ్చాయి. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఆమె చేసిన పరుగులు కేవలం 30 మాత్రమే. పాకిస్థాన్‌పై 9 పరుగులు, బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో కేవలం 2 పరుగులకే ఫెవీలియన్ కు చేరడం ఆమె వైఫల్యాన్ని తెలియజేస్తోంది.

షెఫాలీ నిలకడైన ఆటతీరు.. మంధాన తోడయ్యేనా?

మరో ఓపెనర్ షెఫాలీ వర్మ నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభాలు అందిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌లలో 2 హాఫ్ సెంచరీలతో సహా అత్యధికంగా 168 పరుగులు చేసింది. ఒకవైపు షెఫాలీ మంచి ఫామ్‌లో ఉండగా, మరోవైపు స్మృతి మంధాన క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోవడం పవర్ ప్లే స్కోరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫైనల్ పోరులో శ్రీలంక బలమైన బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవాలంటే మంధాన తిరిగి పాత ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శ్రీలంకపై రివేంజ్ తీర్చుకునే గొప్ప అవకాశం

రెండేళ్ల క్రితం ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాభవాన్ని భారత్ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై విజయం సాధించి కప్‌ను ముద్దాడటంతో పాటు పాత బకాయిలు తీర్చుకోవడానికి గొప్ప అవకాశం లభించింది. బౌలర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తరుణంలో బ్యాటర్లు సమష్టిగా రాణిస్తేనే దుబాయ్‌లో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకోవడం సాధ్యమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *