బెంగళూరు, సెప్టెంబర్ 10: ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు SIRకు సంబంధించి ఎలాంటి నోటీసు జారీ చేయలేదని బెంగళూరు అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి (DEO), చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు స్పష్టం చేశారు. మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో SIR ప్రక్రియలో భాగంగా ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారని DEO తెలిపారు. రాష్ట్ర SVEEP నోడల్ అధికారి, బెంగళూరు వెస్ట్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఫారాలను అందజేశారని, అవసరమైన సమాచారాన్ని కూడా సక్రమంగా నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. అంతకుముందు వచ్చిన మీడియా కథనాల ప్రకారం.. ఓటర్ల జాబితాలో ఆయన పేరుకు సంబంధించిన స్పెల్లింగ్‌లో తేడా ఉన్నట్లు పేర్కొన్నారు. 2002 నాటి పాత ఓటర్ల జాబితాలో పేరు ‘Prof CNR Rao’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘Prof’ స్థానంలో అదనంగా ఒక ‘f’ చేరి ‘Proff CNR Rao’గా నమోదైందని సమాచారం. ఈ తరహా వివరాల వ్యత్యాసాన్ని ‘Self-name mismatch’గా పేర్కొంటారు. 2002 ఓటర్ల జాబితాలోని వివరాలను ఆధారంగా చేసుకుని SIR ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపినప్పుడు, అవి ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వివరాలతో సరిపోలకపోతే ఇలాంటి వ్యత్యాసం ఏర్పడుతుంది.
ఈసీ ఏమంటోంది?
ఈ వార్తలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. 2002లో ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు 76-మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్ట్ నంబర్ 129, సీరియల్ నంబర్ 431లో ఓటరుగా నమోదయ్యారని తెలిపింది. ఆ సమయంలో ఆయన పేరు ‘Rama’గా నమోదై ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన 157-మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్ట్ నంబర్ 59, సీరియల్ నంబర్ 187లో ‘Prof. C. N. Rao M’ పేరుతో ఓటరుగా నమోదై ఉన్నారని ఈసీ వెల్లడించింది. ఆయన పేరు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలోనూ చేర్చినట్లు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
దేశ ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరు
92 ఏళ్ల ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు బెంగళూరులో జన్మించారు. ఘన, నిర్మాణ రసాయన శాస్త్రం (Solid-State and Structural Chemistry) రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్న శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. భారతరత్న పొందిన మూడో శాస్త్రవేత్తగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పద్మ విభూషణ్, పద్మశ్రీ, కర్ణాటక రత్న వంటి అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. భారత శాస్త్ర విధానాల రూపకల్పనలోనూ ప్రొఫెసర్ రావు కీలక పాత్ర పోషించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చెందిన శాస్త్రీయ సలహా మండలిలో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం రాజీవ్ గాంధీ, హెచ్.డీ. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రుల శాస్త్రీయ సలహా మండళ్లకు నేతృత్వం వహించారు. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)కు నాయకత్వం వహించిన ఆయన, జక్కూర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR)ను స్థాపించారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ సేవలందించారు. అయితే SIR సందర్భంగా ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు నోటీసు జారీ అయిందంటూ వచ్చిన వార్తలను ఎన్నికల సంఘం ఖండించడంతో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చింది.