Headlines

ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో భారీ మార్పులు.. ఇక బట్టీ విధానానికి చెక్‌! కొత్త విధానం ఇదే


అమరావతి, సెప్టెంబర్‌ 10: విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం గుర్తుపెట్టుకోవడమే కాకుండా.. వాటిని అర్థం చేసుకుని, విశ్లేషించి సమాధానాలు ఇచ్చేలా పరీక్షల విధానాన్ని మార్చనున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించేలా రూపొందించనున్నారు. జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం దేశవ్యాప్తంగా పరీక్షల విధానంలో ఒకే తరహా ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో నుంచే పబ్లిక్‌ పరీక్షల్లోనూ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాసే పరిస్థితి ఉందని అధికారులు గుర్తించారు.

10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో..

ఈ పరిస్థితిని మార్చేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను కొత్త తరహాలో ఇవ్వనున్నారు. విద్యార్థి ఒక అంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? దాన్ని కొత్త పరిస్థితుల్లో ఎలా అన్వయించగలడు? అనే అంశాలను పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా ప్రత్యేకంగా క్వశ్చన్‌ బ్యాంక్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధ్యాపకులకు కార్యశాలలు నిర్వహిస్తోంది. అధ్యాపకుల నుంచి సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనను పరీక్షించే ప్రశ్నలను ఆహ్వానించి.. వాటిని పరిశీలించిన అనంతరం ప్రత్యేక క్వశ్చన్‌ బ్యాంక్‌ రూపొందించనున్నారు.

ఇవి కూడా చదవండి



సిద్ధం చేసిన ప్రశ్నలను వచ్చే విద్యా సంవత్సరం ముద్రించే కొత్త పాఠ్యపుస్తకాల్లో పాఠం చివర ఇచ్చే ప్రశ్నల్లో చేర్చనున్నారు. తద్వారా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే కొత్త తరహా ప్రశ్నలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇంటర్మీడియట్‌ విద్యలో బట్టీ విధానాన్ని తగ్గించి.. అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, ఆలోచించడం, అన్వయించడం వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా పరీక్షల విధానంలో మార్పులు తీసుకురానున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *