Headlines

నెలలు గడిచినా.. ఇచ్చిన మాట మర్వలేదు.. విద్యార్థులకు గ్రూప్‌-1 అధికారుల అదిరిపోయే గిఫ్ట్


నెలలు గడిచినా ఇచ్చిన హామీని మర్చిపోకుండా నెరవేర్చారు గ్రూప్‌-1 శిక్షణాదికారులు. శిక్షణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా బురుగుపల్లి మహాత్మా జ్యోతి బా పూలే రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ను గ్రూప్ వన్ శిక్షణ అధికారులు ఫిబ్రవరి నెలలో సందర్శించారు. ఆ సమయంలో పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడిన అధికారులు.. వారి చదువుకు డిజిటల్ బోధన మరింత ఉపయోగపడుతుందని గుర్తించారు. పాఠ్యాంశాలను దృశ్యరూపంలో వివరించేందుకు పాఠశాలకు ప్రొజెక్టర్ అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటకు అనుగుణంగా శనివారం పాఠశాలకు ప్రొజెక్టర్ ను అందజేశారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి విష్ణు నందన్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ క్రిస్టినా చేతుల మీదుగా ప్రొజెక్టర్ ను పాఠశాల యాజమాన్యానికి అందించారు.

ప్రొజెక్టర్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు పాఠ్యాంశాలను మరింత ఆసక్తికరంగా బోధించేందుకు అవకాశం కలుగుతుందని పాఠశాల సిబ్బంది తెలిపారు. కేవలం పుస్తకాల్లో చదవడం కంటే డిజిటల్ కంటెంట్, చిత్రాలు, వీడియోల ద్వారా పాఠాలను వివరించడం వల్ల విద్యార్థులకు అంశాలు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. పాఠశాలలోని విద్యార్థుల అభ్యసనకు ఈ ప్రొజెక్టర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తమ హామీని గుర్తుపెట్టుకుని అమలు చేసిన గ్రూప్ 1 శిక్షణాధికారులకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రొజెక్టర్‌ అందజేతకు సహకరించిన వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌ అవుల సతీష్‌, డీఎస్పీ (సివిల్‌) సి.హెచ్ ఆది శేషు రెడ్డి (జీఎల్‌), పీడీసీ తౌటం రోహిత్‌ నేత, డీఎస్పీ (సివిల్‌) బుసిరెడ్డి శాంతన్‌ కుమార్‌ రెడ్డి, డీఎస్పీ (సివిల్‌ కరిపే సాయికమల్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బానోత్‌ సురేష్‌బాబు, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వై. సుశాంత్‌ రెడ్డి, డీఎస్పీ (సివిల్‌) ఏ. భరత్‌ కుమార్‌ రెడ్డి, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ రోహిత్రాజ్‌ సుద్దాల, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–II గొల్ల మారుతి, పీడీసీ ఐతు నితీష్‌ ఉన్నారు.

విద్యార్థుల చదువుకు ఉపయోగపడే చిన్న అవసరాన్ని గుర్తించి… ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా గ్రూప్ 1 శిక్షణాధికారులు ఆదర్శంగా నిలిచారని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *