Headlines

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే టికెట్‌తో బస్సు, ఆటో సేవలు.. ఆర్టీసీ సరికొత్త ప్రయోగం!

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే టికెట్‌తో బస్సు, ఆటో సేవలు.. ఆర్టీసీ సరికొత్త ప్రయోగం!


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ భావనతో తెలంగాణ ఆర్టీసీ ఈ కొత్త సేవలను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికుడు ఇంటి నుంచి సమీపంలోని బస్ స్టాప్‌కు, అలాగే గమ్యస్థానంలోని బస్ స్టాప్ నుంచి చివరి గమ్యానికి సులభంగా చేరుకునేలా ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. దీంతో బస్సు ప్రయాణంలో ఎదురయ్యే రవాణా ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ సేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రయాణికులు బస్సు టికెట్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఒకే బుకింగ్‌తో పూర్తి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ప్రయాణికులకు సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి.

మొదటి దశలో ఈ సేవలను హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని ఇతర నగరాలు, ప్రధాన పట్టణాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. బస్సు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, అందుబాటులోకి తీసుకురావడానికి టీజీఎస్ఆర్టీసీ చేపడుతున్న ఈ కొత్త కార్యక్రమం ప్రయాణికులకు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రోజువారీగా బస్సులపై ఆధారపడే వేలాది మందికి ఈ ఎలక్ట్రిక్ ఆటో సేవలు ప్రయోజనకరంగా మారనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *