యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటాగా నటించిన లేటేస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో శ్రేయాస్ మీడియా నిర్వహించిన సక్సెస్ మీట్లో కథానాయిక శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని, కొంత భావోద్వేగంగా ఉన్నానని ఆమె తెలిపారు. తన దివంగత తల్లిని గుర్తుచేసుకుంటూ, తన సక్సెస్ తన తల్లి చూసుంటే ఎంతో సంతోషించేవారని పేర్కొన్నారు. అయితే, తన తల్లి తనను చూస్తోందని, ఆమె ఆశీస్సుల వల్లే ఈ పేరు వచ్చిందని గౌరీ ప్రియ అన్నారు. తల్లిదండ్రుల మద్దతు లేకుండా తాను ఏదీ సాధించలేనని, తన తండ్రికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
“ఇంతటి మంచి పేరు, సక్సెస్ వస్తున్న ఈ సమయంలో మా అమ్మ నా పక్కన ఉండి ఉంటే ఎంతగానో సంతోషించేది. నన్ను ఇలా చూసి ఉంటే ఎంత బాగుండేదో అని చుట్టుపక్కల అందరూ అంటున్నారు. కానీ నాకు తెలుసు.. నా అమ్మ ఎప్పటికీ పైనుంచి నన్ను చూస్తూ ఆశీర్వదిస్తూనే ఉంటుంది” అంటూ భావోద్వేగానికి గురైంది.
ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందో, ఆమె ప్రేమ గెలిచినా, విఫలమైనా ఆ కోణం నుండి సినిమాను చూపించాలనే ఆలోచన చేసినందుకు రచయిత సాయి రాజేష్‌కి, అలాగే తనను ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అందమైన కథను అద్భుతంగా డైరెక్ట్ చేసిన రవి నంబూరికి హ్యాట్సాఫ్ చెప్పారు. సహనటుడు కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ, ఒక ప్రేమకథలో రెండు పాత్రల మీద రెండున్నర గంటలు కథను నడిపించడం కష్టమైన విషయమని, కానీ కిరణ్ అద్భుతంగా నటించారని కొనియాడారు. కిరణ్‌లో ఒక మంచి స్నేహితుడిని కనుగొన్నానని, తనను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సిరి, పూజ, మహేందర్, నవీన్, త్రిగుణ్ సహా చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చివరగా, ఒక తెలుగు అమ్మాయిగా, తన కెరీర్లో ఇంత తొందరగా ఇంత మంచి కథ, పాత్ర లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీ గౌరీ ప్రియ అన్నారు.