పదో తరగతిలో ఫెయిల్ అయ్యాననే భయం.. ఇంట్లో ఏమంటారోనన్న ఆందోళన.. ఆ క్షణంలో తీసుకున్న ఒక చిన్న తొందరపాటు నిర్ణయం, ఆ కుటుంబాన్ని ఏకంగా 30 ఏళ్ల పాటు విడదీసింది. కన్న కొడుకు ఎక్కడున్నాడో తెలియక ఆ తల్లిదండ్రులు కంటికి మంటికి ఏకధారగా విలపించారు. మరోవైపు, అసలు తన తల్లిదండ్రులు బతికే ఉన్నారో లేదో కూడా తెలియక ఆ కొడుకు లోలోపలే నలిగిపోయాడు. అలా విడిపోయిన ఆ కన్నపేగులు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఎలా కలిశాయి? ఎన్నికల సంఘానికి చెందిన ఒక చిన్న SIR అప్లికేషన్ ఫారమ్ వారి జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపిందో తెలిపే అపూర్వ ఘటన కర్నాలు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎల్లమ్మ, ఎల్లప్ప దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాముడు 1996 వ సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో అతని పెద్దనాన్న కొడుకు నాగరాజు కూడా పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయారు.
ఆరు సంవత్సరాల తర్వాత నాగరాజు తిరిగి ఇంటికి చేరుకోగా, రాముడు మాత్రం ముంబై, పుణే వంటి ప్రాంతాలు తిరుగుతూ అక్కడే ఉండిపోయాడు. కాలం వేగంగా గడిచిపోయింది.. చివరకు రాముడు బెంగళూరు చేరుకుని, కష్టపడి సొంత కాళ్లపై నిలబడ్డాడు. పెళ్లి చేసుకుని, ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. జీవితంలో స్థిరపడినా, మనసులో మాత్రం సొంత ఊరు, కన్నతల్లిదండ్రుల జ్ఞాపకాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేవి. కానీ, తిరిగి ఊరికి వెళ్లే ధైర్యం అతనికి సరిపోలేదు.
ఇటీవల ఒక అధికారిక అవసరం కోసం.. SIR అప్లికేషన్ భర్తీ చేయాల్సి వచ్చింది. అందులో తల్లిదండ్రుల పూర్తి పేరు, సొంత ఊరి చిరునామా తప్పనిసరిగా నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్క అప్లికేషనే రాముడిని తన మూలాల వైపు అడుగులు వేసేలా చేసింది. ఇక లాభం లేదు.. ఎలాగైనా నా తల్లిదండ్రులను చూడాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.
30 ఏళ్ల తర్వాత రాముడు మళ్లీ తన సొంత నేల ఎమ్మిగనూరులో అడుగుపెట్టాడు. ఇంటికి చేరుకోగానే వృద్యాప్యంతో కన్నతల్లిదండ్రులు కళ్లముందు కనిపించగానే రాముడి గుండె చెరువైంది. ఆనకట్టు తెగిన విధంగా అతని కళ్లలోంచి కన్నీటి దారలు దూసుకొచ్చాయి. 30 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కొడుకు ప్రత్యక్షమయ్యేసరికి ఆ కన్నపేగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఇల్లు ఒక్కసారిగా ఆనంద బాష్పాలతో మునిగిపోయింది. కాలం ఎంత ముందుకు సాగినా, విధి అనుకుంటే ఏ బంధాన్నైనా మళ్లీ ఒకే తీరానికి చేర్చగలదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.