Andhra Pradesh: ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..

Andhra Pradesh: ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..


ఏపీలోని వాహనదారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్లలో వేగం పుంజుకోనుంది. సచివాలయంలోని ఆర్టీజీఏస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్బంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూసే ప్రక్రియకు స్వస్తి పలకాలని, 24 గంటల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు.

ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం

ప్రభుత్వం అందించే సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, దీని ద్వారా వేగవంతంగా ప్రజలకు సేవలు అందించవచ్చని తెలిపారు. ఇందుకోసం నిపుణులతో ఒక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందించే సేవల్లో ఏఐ వినియోగం పెంచడం, సమర్ధవంతంగా వాడటంపై కమిటీ పనిచేయాలన్నారు. ఇక రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులోకి ఉంచాలన్నారు. స్వచ్చంధ సంస్థల సహకారంతో వాటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదేశాలు జారీ చేశారు. వడదెబ్బ మరణాలు అనేవి జరగకుండా చూడాలన్నారు.

డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ విషయంలో కీలక మార్పులు చేసింది. వాహన డీలర్లే వద్దే రిజిస్ట్రేషన్ జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఇందుకోసం కొత్త ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ఫ్లాట్‌ఫామ్ రవాణశాఖతో కనెక్ట్ అయి ఉంటుంది. దీని ద్వారా వాహన డీలర్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు. దీని వల్ల రవాణాశాఖ కార్యాలయాలకు వాహనదారులు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రోజులు తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.  అంతేకాకుండా రవాణాశాఖ కార్యాలయాల వద్ద కూడా రద్దీ తగ్గుతుంది. ఈ ఏడాది నుంచి ఈ కొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. వాహనదారులకు ఊరట కలిగింది. సమయం, డబ్బు అన్నీ వాహనదారులకు ఆదా అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *