Video: గొంతులో ఏదైన ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి..? ప్రాణాలు కాపాడే సీక్రెట్స్ ఇవే..

Video: గొంతులో ఏదైన ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి..? ప్రాణాలు కాపాడే సీక్రెట్స్ ఇవే..


నిత్య జీవితంలో మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇబ్బంది పడటం చూస్తుంటాం. దీనిని వైద్య పరిభాషలో చోకింగ్ అంటారు. లోపలికి వెళ్లింది శ్వాసనాళానికి అడ్డుపడితే, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఇది నిమిషాల వ్యవధిలోనే ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి కీలక సమయంలో సరైన అవగాహన ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని డాక్టర్ జెరెమీ లండన్ వివరిస్తున్నారు. ఒక వ్యక్తి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, తక్షణమే స్పందించే ముందు వారికి నిజంగా సహాయం అవసరమో లేదో నిర్ధారించుకోవాలి. సదరు వ్యక్తి దగ్గగలిగినా లేదా మాట్లాడగలిగినా వారి శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోలేదని అర్థం. ఆ సమయంలో వారిని మరింత గట్టిగా దగ్గమని ప్రోత్సహించాలి, తద్వారా గొంతులో ఇరుక్కున్న వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి మాట్లాడలేకపోయినా, వారి ముఖం నీలి రంగులోకి మారుతున్నా, లేదా గొంతును రెండు చేతులతో పట్టుకుని సైగలు చేస్తున్నా అది అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి.

జీవన్మరణ పోరాటంలో ఈ 5+5 సూత్రం పాటించండి

డాక్టర్ల సూచన ప్రకారం.. ఇలాంటి సమయంలో 5 వీపు దెబ్బలు – 5 హైమ్లిచ్ విన్యాసాలు పద్ధతిని అనుసరించాలి. సదరు వ్యక్తి వెనుక నిలబడి, అతడిని కొంచెం ముందుకు వంచి.. మీ అరచేతి అడుగు భాగంతో వారి భుజాల మధ్యలో ఐదుసార్లు గట్టిగా తట్టాలి.

5 సార్లు హైమ్లిచ్ విన్యాసం

  • వీపుపై తట్టినప్పుడు వస్తువు బయటకు రాకపోతే వెంటనే ఈ పద్ధతిని అనుసరించాలి..
  • వ్యక్తి వెనుక నిలబడి మీ చేతులతో వారి నడుమును చుట్టేయండి.
  • మీ ఒక చేతిని పిడికిలిగా బిగించి, బొటనవేలు వైపు భాగాన్ని వారి బొడ్డుకు కొంచెం పైన ఉంచాలి.
  • మరో చేత్తో ఆ పిడికిలిని గట్టిగా పట్టుకుని, లోపలికి, పైకి బలంగా నెట్టాలి. ఇలా ఐదు సార్లు చేయాలి.
  • ఈ ప్రక్రియను ఆ వస్తువు బయటకు వచ్చే వరకు లేదా ఆ వ్యక్తి స్పృహ కోల్పోయే వరకు కొనసాగించాలి.

ఒకవేళ స్పృహ కోల్పోతే..

దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి స్పృహ కోల్పోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తరలించారు. మీకు అవగాహన ఉంటే సీపీఆర్ చేయాలి. కాగా “నిమిషాల వ్యవధిలోనే ప్రాణాంతకం కాగల ఇలాంటి పరిస్థితుల్లో సరైన టెక్నిక్ ఒక వ్యక్తికి పునర్జన్మను ప్రసాదిస్తాయి” అని డాక్టర్ జెరెమీ లండన్ స్పష్టం చేశారు. ఈ పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో హీరోలుగా నిలవవచ్చు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *