
మన దేశంలో డీజిల్ ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపించడం వల్ల ఇంధన మార్కెట్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా బల్క్ వినియోగదారులు ఇప్పుడు చౌకైన రిటైల్ పెట్రోల్ పంపుల నుంచి డీజిల్ కొనుగోలు చేయడం ప్రారంభించడంతో చమురు కంపెనీల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. తాజా నివేదికల ప్రకారం, బల్క్ సెగ్మెంట్‌లో డీజిల్ అమ్మకాలు 30 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం బల్క్, రిటైల్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. ఉదాహరణకు ఢిల్లీలో బల్క్ వినియోగదారులకు డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.134.5 కాగా, అదే డీజిల్ రిటైల్ పంపుల వద్ద రూ.87.6కే లభిస్తోంది. అలాగే విశాఖపట్నంలో బల్క్ ధర రూ.148.5 ఉండగా, రిటైల్ ధర రూ.96.4గా ఉంది. అంటే లీటరుకు రూ.47 నుంచి రూ.52 వరకు తేడా ఉండడం వినియోగదారులను రిటైల్ వైపు మళ్లిస్తోంది. ఈ పరిణామాలకు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు రక్షణ, రైల్వేలు, మైనింగ్, పరిశ్రమలు వంటి పెద్ద వినియోగదారులకు డీజిల్ ధరలను పెంచాయి. అయితే సామాన్య ప్రజలపై భారం పడకుండా రిటైల్ ధరలను పెంచలేదు.
దీంతో కంపెనీలు రిటైల్ విక్రయాల్లో నష్టాలు చవిచూస్తుండగా, ఇప్పుడు బల్క్ వినియోగదారులు కూడా రిటైల్ పంపుల వైపు మళ్లడంతో ఆ నష్టాలు మరింత పెరుగుతున్నాయి. చిన్న పరిశ్రమలు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, మత్స్య రంగానికి చెందిన సంస్థలు ప్రధానంగా ఈ మార్పుకు దోహదపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళన అవసరం లేదని చెబుతోంది. గతంలో ఉక్రెయిన్ వార్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించిందని గుర్తుచేస్తోంది. ప్రస్తుతం కంపెనీలు మార్కెట్ వాటా కోల్పోయినా, ధరలను నియంత్రించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి