Weather Update: ఓవైపు ఎండలు, మరో వైపు వర్షాలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతుందంటే?

Weather Update: ఓవైపు ఎండలు, మరో వైపు వర్షాలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతుందంటే?


ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వాహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

బుధవారం ఈ మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం

విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

మంగళవారంలో రాష్ట్రంలో వాతవరణం ఇలా

ఇదిలా ఉండగా రాష్ట్రంలో మంగళవారం మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 140 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.

ఎండల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బిపి ఉన్నవారు ఎండలో తిరగడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. దాహం వేసినా వేయకపోయినా క్రమం తప్పకుండా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని, బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వేడి గాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కళ్ల రక్షణ కోసం తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ధరించాలని ఆయన కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *