నిద్రపోవడానికి మీ చిన్నారి చుక్కలు చూపిస్తోందా? 7 టిప్స్‌తో చిటికెలో నిద్రలోకి

నిద్రపోవడానికి మీ చిన్నారి చుక్కలు చూపిస్తోందా? 7 టిప్స్‌తో చిటికెలో నిద్రలోకి


నిద్రపోవడానికి మీ చిన్నారి చుక్కలు చూపిస్తోందా? 7 టిప్స్‌తో చిటికెలో నిద్రలోకి

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణులు సూచించే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను పాటిస్తే పిల్లలు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చేయవచ్చు. శరీరానికి గడియారం లాంటి ఒక అంతర్గత వ్యవస్థ ఉంటుంది, దీనినే సర్కేడియన్ రిథమ్ అంటారు. పిల్లలకు ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేయడం వల్ల ఈ వ్యవస్థ క్రమబద్ధం అవుతుంది.

డిజిటల్ స్క్రీన్లకు దూరం..

నేటి కాలంలో మొబైల్, టీవీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలు పిల్లల నిద్రకు ప్రధాన శత్రువులుగా మారాయి. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును మేల్కొలిపే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే నిద్రపోయే కనీసం ఒక గంట ముందే అన్ని రకాల స్క్రీన్‌లను ఆపేయాలి. దీనికి బదులుగా పుస్తకం చదవడం లేదా కథలు చెప్పడం వంటివి అలవాటు చేయాలి. అలాగే నిద్రకు ముందు ఒక క్రమ పద్ధతిని అనుసరించడం పిల్లలకు చాలా ముఖ్యం. ఉదాహరణకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, పాలు తాగించడం, తర్వాత కథ చెప్పి నిద్రపుచ్చడం ఒక రొటీన్ కావాలి. దీనివల్ల స్నానం చేసిన వెంటనే పిల్లల మెదడు నిద్ర మూడ్‌లోకి వెళ్లిపోతుంది.

డిన్నర్ సమయం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రపోయే ముందే భోజనం తినిపిస్తే జీర్ణక్రియ దెబ్బతిని, పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలు రాత్రి పూట పదే పదే నిద్రలేస్తారు. అందుకే నిద్రకు రెండు గంటల ముందే తేలికపాటి భోజనం ముగించేయాలి. పడుకునే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు ఇస్తే వారు ప్రశాంతంగా నిద్రపోతారు.

గది వాతావరణం..

నిద్రకు అనువైన గది ఉష్ణోగ్రత 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉండాలి. పడుకోవడానికి ముందే ఫ్యాన్ లేదా ఏసీ వేసి గదిలో వేడి తగ్గేలా చూడాలి. గదిని వీలైనంత చీకటిగా ఉంచడం వల్ల గాఢ నిద్ర పడుతుంది, ఒకవేళ పిల్లలు భయపడితే చిన్న నైట్ ల్యాంప్ వాడవచ్చు. తల్లి లేదా తండ్రి గొంతు వింటూ కథలు వినడం వల్ల పిల్లలకు రక్షణగా అనిపిస్తుంది, వారి మనసులోని ఒత్తిడి తగ్గి మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఇది తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య మంచి అనుబంధాన్ని కూడా పెంచుతుంది.

పగటిపూట శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం నిద్రకు ఎంతో అవసరం. సైకిల్ తొక్కడం, రన్నింగ్ చేయడం లేదా బయట ఆడుకోవడం వంటి పనుల వల్ల శరీరం అలసిపోయి రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. అయితే నిద్రకు రెండు గంటల ముందు ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేయించకూడదు. చిన్నప్పటి నుంచే మంచి నిద్ర అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక కూడా నిద్రలేమి సమస్యల బారిన పడకుండా ఉంటారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. ఈ చిన్న మార్పులు మీ ఇంట్లో సంతోషాన్ని, ప్రశాంతతను నింపుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *