
ప్రస్తుతం ఎండలు ఏ స్థాయిలో మండుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఉక్కపోత, వేడి గాలులతో మనుషులమే అల్లాడిపోతుంటే, మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యంగా భూమి వేడెక్కడంతో చల్లదనం కోసం పాములు జనావాసాల్లోకి రావడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. తాజాగా మైసూరులో ఒక ఇంట్లోకి భారీ నాగుపాము ప్రవేశించడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మైసూరులోని ఒక ఇంట్లో కిటికీకి ఉన్న నెట్‌లో ఒక నాగుపాము చిక్కుకుపోయి కనిపించింది. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి లోపలికి రావడానికి ప్రయత్నించిన ఆ పాము, బయటపడలేక అందులోనే ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ‘స్నేక్ శ్యామ్’ తక్షణమే అక్కడికి చేరుకున్నారు. పాముకు ఎలాంటి గాయం కాకుండా, నెట్‌ను జాగ్రత్తగా కత్తిరించి దానిని బయటకు తీశారు. స్నేక్ శ్యామ్ తనదైన శైలిలో ఎంతో నేర్పుగా, ప్రాణాలకు తెగించి ఆ విష సర్పానికి విముక్తి కలిగించారు.
సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న తరుణంలో, పాములకు తమ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడం కష్టమవుతుంది. అందుకే అవి చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోని బాత్‌రూమ్‌లు, కిటికీలు లేదా గార్డెన్‌లలోకి చేరుతుంటాయి. ఇలాంటి సమయంలో భయపడి వాటిని చంపకుండా, నిపుణులకు సమాచారం అందించాలని స్నేక్ శ్యామ్ సూచిస్తున్నారు. ఎండల తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోకి పాములు రాకుండా తలుపులు, కిటికీల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. చివరకు రక్షించిన ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది చదవండి: మీ భూమి కబ్జాకు గురైందా? ఆస్తిని తిరిగి దక్కించుకోవడం ఈజీ.. ఈ ఒక్క పని చేస్తే చాలు..