మంచి రవ్వలు, కొర్రమీనులు పడతాయని వల వేసిన జాలర్లు.. తీరా పైకి లాగి చూడగా..

మంచి రవ్వలు, కొర్రమీనులు పడతాయని వల వేసిన జాలర్లు.. తీరా పైకి లాగి చూడగా..


నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో మత్స్యకారులు ప్రతి ఏటా చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కొర్రమీను, రవ్వలు, బోచ్చలు, బురద మట్టలు చేప పిల్లలను అందించి చెరువులో వేయడం జరిగింది. ఈ చెరువులోకి పిల్లాయిపల్లి కాల్వ ద్వారా నిరంతరం మూసి నీరు వచ్చి చేరుతుంది. చేపలు కూడా ఎదిగి తమకు లాభాలు వస్తాయని మత్స్య కారులు ఆశించారు. రెండు రోజులుగా మత్స్య కారులు చెరువులోని చేపల వేటకు వలలు వేశారు. వింత ఆకారంలో ఉన్న చేపలు కుప్పలు కుప్పలుగా లభించాయి. వీటిని చూసి మత్స్య కారులు షాక్ తిన్నారు. తాము చెరువులో వేసిన చేపలు కాకుండా రాకాసి (డెవిల్ ఫిష్) చేపలు ఐదు టన్నులకు పైగా బయట పడ్డాయి. పెట్టుబడి పెట్టి చేపలను పెంచి తీరా చేపలను పట్టే సమయంలో రాకాసి చేపలు చిక్కడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. పిల్లాయిపల్లి కాల్వ నీటి ద్వారా ఈ రాకాసి చేపలు చెరువులోకి వచ్చి చెరువులోని ఇతర చేపలను బ్రతకనివ్వకుండా చేశాయనీ మత్స్యకారులు వాపోతున్నారు. ఈ రాకాసి చేపలు చెరువులోకి వచ్చి చేప పిల్లలను తినేస్తున్నాయని తమకు తీవ్ర నష్టం వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

అసలేంటి డెవిల్ ఫిష్…

ఈ “డెవిల్ ఫిష్”గా పిలిచే చేపను సాధారణంగా ‘సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్ అని అంటారు. ఒకసారి చెరువులోకి ప్రవేశిస్తే.. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తక్కువ సమయంలోనే వేగంగా విస్తరించి, తన సంఖ్యను పదింతలు, వందింతలు పెంచుకుంటుంది. రైతులు, మత్స్యకారులు వేసే మేతను విస్తారంగా తినేసే ఈ చేప.. అంతేకాదు మాంసాహార స్వభావంతో చిన్న చేపలను కూడా మింగేస్తుంది. ఇది చాలా గట్టిగా తట్టుకునే స్వభావం కలిగిన చేప. నీరు తగ్గినా లేదా లేకపోయినా కూడా 10–15 రోజుల పాటు బతికే సామర్థ్యం ఉంది. అవసరమైతే మట్టిలోకి దూరి జీవిస్తుంది. అక్కడి నుంచి గట్లను తొలచుకుని మరో చెరువులోకి కూడా చేరగలదు. వలలో చిక్కినా, తన బలమైన నోరు, పదునైన పళ్లతో వలలను చెరిపేసి తప్పించుకునే లక్షణం ఉంది. కొన్ని సందర్భాల్లో మనుషులను కూడా కరిచి గాయపరచిన ఘటనలు నమోదయ్యాయి.

వాస్తవానికి ఇది అక్వేరియం చేపగా విదేశాల నుంచి.. ప్రత్యేకంగా దక్షిణ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చింది. గాజు ట్యాంకుల్లో పేరుకునే మురికిని తినడం వల్ల అక్వేరియంలను శుభ్రంగా ఉంచేందుకు దీనిని పెంచేవారు. అయితే నిర్లక్ష్యంగా కాలువల్లో వదిలేయడం వల్ల.. డ్రైనేజీ నుంచి కాలువలకు, అక్కడి నుంచి చెరువులు, రిజర్వాయర్లు, నదుల వరకు విస్తరించింది. ఈ చేపలను పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టం అని అధికారులు చెబుతున్నారు. మందులు లేదా ఇతర సాధారణ పద్ధతులు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఫలితంగా ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో మత్స్యకారులు, రైతులు కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు.

Also Read: అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *