నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి, భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని అధిరోహించిన బాలెన్ షా ప్రభుత్వానికి నెల తిరగకముందే ఊహించని సవాలు ఎదురైంది. కాఠ్మండు మేయర్‌గా మెరుపులు మెరిపించిన బాలెన్, ఇప్పుడు దేశవ్యాప్త నిరసనల సెగను ఎదుర్కొంటున్నారు. కాఠ్మండు వీధుల నుండి దేశ పరిపాలనా కేంద్రమైన ‘సింఘా దర్బార్’ వరకు ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.
ఒకప్పుడు బాలెన్ షాను ఆశాకిరణంగా చూసిన యువత, ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించకుండా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు, పౌర సమాజాన్ని పక్కన పెట్టడం వంటి చర్యలు ప్రభుత్వాన్ని రక్షణలో పడేసాయి. ముఖ్యంగా భారతదేశం నుండి తెచ్చుకునే రూ. 100 పైబడిన ప్రతి వస్తువుపై కస్టమ్స్ సుంకం విధించాలన్న నిర్ణయం నేపాల్‌లో చిచ్చు రేపింది. సరిహద్దు ప్రాంత ప్రజలు నిత్యావసరాల కోసం భారత్‌పైనే ఆధారపడతారు. ఈ నిర్ణయం తమ పొట్ట కొట్టడమేనని సామాన్యులు రోడ్డెక్కారు. అటు విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ అనుబంధం ఉన్న విద్యార్థి సంఘాలను ప్రభుత్వం విస్మరించడం మరో వివాదానికి దారితీసింది. పాఠశాల యూనిఫారాలు ధరించిన వేలాది మంది విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలపడం దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వానిది అణచివేత వైఖరి అని విద్యార్థి లోకం మండిపడుతోంది.
మరోవైపు హోం మంత్రిపై అవినీతి ఆరోపణలు నిరసనలకు కారణమైంది. హోం మంత్రి సుడాన్ గురుంగ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆర్థిక నేరగాళ్లతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపణలు రావడంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
విధానపరమైన నిర్ణయాలతో మొదలైన ఈ అసంతృప్తి, ఇప్పుడు బాలెన్ షా నాయకత్వానికే సవాలుగా మారింది. వీధుల్లో పెరుగుతున్న ఈ అశాంతిని ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరిస్తుందా లేక కఠినంగా వ్యవహరిస్తుందా అన్నది ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒక జాతీయ నాయకుడిగా బాలెన్ షాకు ఇది అగ్నిపరీక్షే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..