Headlines

85 ఏళ్ల వయసులోనూ పేదల కోసం సేవ.. కలెక్టర్ చొరవతో ‘రూపాయి ఇడ్లీ’కి మళ్లీ ఊపిరి!


కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు సమీపంలోని వడివేలంపాలయం ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల కమలాతల్ బామ్మ సేవ మరోసారి వార్తల్లో నిలిచింది. గత 30 ఏళ్లకు పైగా పేదలు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఆమె కేవలం రూ.1కే ఇడ్లీలు విక్రయిస్తూ వస్తున్నారు. ధర పెంచకుండా తన సేవను కొనసాగిస్తున్న కమలాతల్ బామ్మకు స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

మొదట్లో కట్టెల పొయ్యిపై ఇడ్లీలు తయారు చేసిన ఆమెకు.. గత పదేళ్లుగా ఆమె సేవకు గుర్తింపుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి. అయితే గత రెండు నెలలుగా ఈ ఉచిత సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో ఇడ్లీలు తయారు చేయడానికి ఇబ్బందులు ఎదురవడంతో పాటు, రూపాయికే ఇడ్లీలు అందించే తన సేవను కొనసాగించడం కష్టంగా మారింది. దీంతో కమలాతల్ బామ్మ స్వయంగా కోయంబత్తూరు జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులను కలిశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరాను తిరిగి కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

బామ్మ సమస్యను అధికారులు సంబంధిత మంత్రి సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. కమలాతల్ బామ్మకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో బామ్మకు ఊరట లభించింది. పేదల కోసం ఆమె కొనసాగిస్తున్న ‘రూపాయి ఇడ్లీ’ సేవకు మళ్లీ ఎలాంటి ఆటంకం లేకుండా మార్గం సుగమమైంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *