
స్నేహం అంటే కష్టాల్లో అండగా నిలవడమే కాదు.. స్నేహితుడి విజయం కోసం తన వంతు సహాయం చేయడమూ అని నిరూపించే ఆసక్తికర ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తన మిత్రుడు సర్పంచ్‌గా గెలిస్తే గ్రామాభివృద్ధి కోసం ఏకంగా రూ.కోటి విరాళంగా ఇస్తానని మరో స్నేహితుడు ప్రకటించారు. దీంతో కొంగాటం పంచాయతీలో ఈ స్నేహితుల కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్నేహితుడి గెలుపు కోసం కోటి రూపాయల ప్రకటన
వి.కోట మండలం కొంగాటం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుతో విజయ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా నిలిచిన స్నేహితుడు కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. విజయ్ కుమార్ సర్పంచ్‌గా విజయం సాధిస్తే, గ్రామాభివృద్ధి కోసం తన కిరణ్ ఫౌండేషన్ తరఫున రూ.కోటి విరాళంగా అందిస్తానని ప్రకటించారు.
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి ఈ హామీ ఇచ్చారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు. ఈ ప్రకటనతో కొంగాటం పంచాయతీ ఎన్నికల్లో స్నేహితుల అనుబంధం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.
2021 ఎన్నికల్లోనూ ఇదే స్నేహబంధం
విజయ్, కిరణ్ కుమార్ రెడ్డిల స్నేహం ఇప్పటిది కాదు. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు కోసం విజయ్ తీవ్రంగా కృషి చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కిరణ్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిన ఆయన రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు రంగాల్లో స్థిరపడ్డారు. పారిశ్రామికవేత్తగా ఎదిగిన అనంతరం కిరణ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం.
ఇప్పుడు తన స్నేహితుడు విజయ్ ఎన్నికల బరిలో నిలవడంతో కిరణ్ స్వయంగా కొంగాటం గ్రామానికి వచ్చి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్ గెలిస్తే గ్రామానికి కోటి రూపాయలు అందిస్తానని ప్రకటించడం ఈ స్నేహబంధానికి మరో ఉదాహరణగా నిలిచింది.
గ్రామాభివృద్ధికి విరాళం ఉపయోగపడుతుంది: ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్నేహితుడి విజయం కోసం గ్రామాభివృద్ధికి రూ.కోటి విరాళం ప్రకటించడం అభినందనీయమన్నారు. విజయ్ కుమార్ గెలిస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కిరణ్ ప్రకటించిన విరాళం గ్రామానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఓటర్ల తీర్పుపైనే అందరి దృష్టి
కొంగాటం పంచాయతీలో తొలి విడతలోనే పోలింగ్ జరుగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉంది. స్నేహితుడి గెలుపు కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించిన కిరణ్ ప్రయత్నం ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ కుమార్ విజయం సాధిస్తారా? స్నేహితుడు ప్రకటించిన కోటి రూపాయల విరాళం గ్రామాభివృద్ధికి అందుతుందా? అన్నది ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది.