Headlines

కుదిరితే 17 శాతం.. లేదంటే 25 శాతం! భారత్‌పై ట్రంప్ కొత్త టారిఫ్ అస్త్రం..!


కుదిరితే 17 శాతం.. లేదంటే 25 శాతం! భారత్‌పై ట్రంప్ కొత్త టారిఫ్ అస్త్రం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌కు షాక్ ఇచ్చారు. భారతీయ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించే దిశగా ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే 17 శాతం సుంకంతో సరిపెట్టుకోవచ్చని, లేదంటే ఏకంగా 25 శాతం వరకు అదనపు టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 25న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) విడుదల చేసిన ప్రతిపాదనలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చర్చనీయాంశంగా మారాయి.

14 ఆర్థిక వ్యవస్థలపై అమెరికా గురి!

అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ నేతృత్వంలోని USTR, మొత్తం 14 ఆర్థిక వ్యవస్థలపై జరిపిన దర్యాప్తులో కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలను ఈ జాబితాలో చేర్చింది.

ఈ దేశాలు తమ దేశీయ మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రభుత్వ విధానాల ద్వారా పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రపంచ మార్కెట్లలో అధిక ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీనివల్ల అమెరికా తయారీ రంగం, ఉద్యోగ అవకాశాలు, స్థానిక పరిశ్రమలకు నష్టం కలుగుతోందని అమెరికా వాదిస్తోంది.

భారత్‌కు 17 శాతమా.. 25 శాతమా?

ఈ ప్రతిపాదనల్లో భారత్‌కు సంబంధించిన అంశమే అత్యంత కీలకంగా మారింది. భారతీయ వస్తువులపై గరిష్ఠంగా 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే భారత్ అమెరికాతో పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఈ సుంకాల రేటును 17 శాతానికి తగ్గించే అవకాశాన్ని కూడా ప్రతిపాదనలో పేర్కొంది. అంటే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితే కొంత ఊరట లభించనుండగా, చర్చలు కొలిక్కి రాకపోతే 25 శాతం వరకు సుంకాల భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇతర దేశాలపై ప్రతిపాదిత సుంకాలివే!

అమెరికా ప్రతిపాదనల ప్రకారం వియత్నాంపై 35 శాతం వరకు, చైనాపై 20 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అవకాశముంది. బంగ్లాదేశ్‌పై 18 శాతం వరకు, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్‌లపై కూడా 18 శాతం వరకు సుంకాలను ప్రతిపాదించింది. యూరోపియన్ యూనియన్‌పై 15 శాతం, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌లపై 15 శాతం వరకు అదనపు సుంకాల ప్రతిపాదనలు ఉన్నాయి. కొన్ని దేశాలకు ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలు, సుంకాలను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు కల్పించారు.

ఇప్పుడే అమల్లోకి రావు.. అభిప్రాయాల సేకరణ తర్వాతే!

అయితే ఈ సుంకాలు వెంటనే అమల్లోకి రావడం లేదు. అమెరికా ప్రభుత్వం ప్రజల నుంచి, సంబంధిత వాణిజ్య వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించనుంది. 2027 జనవరి 5 వరకు లిఖితపూర్వక అభిప్రాయాలను సమర్పించవచ్చు. జనవరి 25 నుంచి సంబంధిత విచారణలు నిర్వహించనున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మొత్తంగా ట్రంప్ ప్రభుత్వం సుంకాలను వాణిజ్య చర్చల్లో ఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌కు 17 శాతం సుంకంతో ఊరట లభిస్తుందా? లేక 25 శాతం టారిఫ్‌ల భారం తప్పదా? అన్నది రానున్న వాణిజ్య చర్చలపై ఆధారపడి ఉంది. ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా ఔషధాలు, ఉక్కు, సౌర విద్యుత్ పరికరాలు, ఐటీ రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *