హోర్ముజ్ జలసంధిలో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికాకు చెందిన అధునాతన మానవరహిత జలాంతర్గత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఈ ప్రకటన వెలువడగా.. వాహనం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు తమ నిపుణులు పనిచేస్తున్నారని ఇరాన్ తెలిపింది.
IRGC ప్రకటన ప్రకారం.. నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించిన సమన్వయ, సంక్లిష్ట ఆపరేషన్‌లో ఈ అండర్‌వాటర్ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు పేర్కొంది. తొలుత దీనిని అమెరికా సైన్యం ఉపయోగించే REMUS 600గా గుర్తించింది. ఈ వాహనం నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబడుతోందని ఇరాన్ ఆరోపించింది. పట్టుబడిన వాహనాన్ని తమ నిపుణులు పరిశీలిస్తూ, అందులోని డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
అయితే ఈ వాదనపై అమెరికా వైపు నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్.. తమ అన్ని ఆపరేషనల్ మానవరహిత వ్యవస్థలు తమ ఆధీనంలోనే ఉన్నాయని, ఇరాన్ చేసిన స్వాధీనం వాదనను తిరస్కరించింది. దీంతో ఈ ఘటనపై ఇరువైపుల వాదనలు భిన్నంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, తాజాగా IRGC ప్రతినిధి ఈ వాహనాన్ని Mk 18 Mod 2 Kingfishగా పేర్కొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. అంటే తొలుత వెల్లడించిన రెమస్-600 గుర్తింపులో మార్పు చోటుచేసుకుంది.
ఇది ఈ నెలలో ఇరాన్ ప్రకటించిన రెండో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్ స్వాధీనం ఘటన. సెప్టెంబర్ 8న హోర్ముజ్ ప్రవేశద్వారం వద్ద మరో అమెరికా మానవరహిత జలాంతర్గత వాహనాన్ని పట్టుకున్నట్లు IRGC ప్రకటించింది. దానిని Dive-LDగా గుర్తించింది.
🔴 BREAKING: Iran’s Revolutionary Guard announced it has seized another US underwater drone in the Strait of Hormuz.
The IRGC identified it as a REMUS 600 autonomous underwater vehicle and said it had been conducting surveillance in the waterway. https://t.co/8kGJYVcxcK
— The Palestine Chronicle (@PalestineChron) September 27, 2026
మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతపై కూడా IRGC తన వైఖరిని పునరుద్ఘాటించింది. అనుమతి లేని రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..