Headlines

‘నిర్భయ’ జ్ఞాపకాలు మళ్లీనా..? ఢిల్లీ అత్యాచార వరుస ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇటీవల చోటుచేసుకున్న లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఆరోపణలతో పాటు.. ఢిల్లీలోని ఓ పార్కులో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఘటనలను ప్రస్తావిస్తూ.. మహిళలు, చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

పార్కులు, బస్‌స్టాప్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాలు తగినంత వెలుతురు, పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదకర ప్రాంతాలుగా మారకూడదని ధర్మాసనం పేర్కొంది. ఘటనల తర్వాత కేవలం సంఘీభావం ప్రకటించడం సరిపోదని.. సంబంధిత అధికారులను జవాబుదారీగా చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఇటీవల గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 4న జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనలో బాలిక దాదాపు 47 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద వదిలివేశారు దుండుగుల. బస్సులో సీసీటీవీ పనిచేయకపోవడం, పలు పోలీస్ చెక్‌పోస్టులు దాటినా తనిఖీలు జరగకపోవడం వంటి అంశాలు కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా స్పందించి సంబంధిత పోలీసు అధికారుల నుంచి నివేదిక కోరింది.

మరోవైపు దక్షిణ ఢిల్లీలోని ఓ పార్కులో బాలికపై ముగ్గురు వ్యక్తులు పోలీసులుగా నటించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ, పోలీసింగ్ వ్యవస్థపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. తదుపరి విచారణలో అధికారులు తీసుకున్న చర్యలు, భద్రతా లోపాలను ఎలా పరిష్కరిస్తారనే అంశాలపై కోర్టు పరిశీలన కొనసాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *