Headlines

రష్యా నుంచి మనం చమురు కొనకూడదట.. వాళ్లు మాత్రం యురేనియం కొంటారట..! ఇదెక్కడి న్యాయం అధ్యక్షా!?


రష్యా నుంచి ఏ దేశమైనా చమురు కొనుగోలు చేస్తే బాగోదు మరి.. అని ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ ఉంటుంది. కానీ మన దేశం మాత్రం రష్యా నుంచి చమురు కొంటూనే ఉంది. పోనీ మనం ఒక్కరిమే ఇలా చేస్తున్నామా అంటే కాదు. ఇదేమో ట్రంప్ సర్కారుకు కోపం తెప్పిస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొనే దేశాల ఎక్స్‌పోర్ట్స్ పై 100 శాతం టారిఫ్ వేయడానికి ఛాన్స్ ఇచ్చే బిల్లుకు.. అమెరికా చట్టసభలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ట్రంప్ సంతకంతో ఇది కార్యరూపం దాలుస్తుంది. దీనిపై మన దేశం కూడా క్లారిటీ ఇచ్చింది. ఆంక్షల బిల్లును జాగ్రత్తగా గమనిస్తూనే.. రియాక్ట్ అయ్యింది. మనకేమో మన దేశ ఇంధన భద్రత ముఖ్యం. దీనికి అనుగుణంగానే వివిధ వనరుల ద్వారా మన దేశానికి ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఇదే విషయాన్ని అమెరికాకు భారత్ గతంలోనూ చెప్పింది.. ఇప్పుడు కూడా అదే చెప్పింది. అయినా రష్యాతో ఆయిల్ బిజినెస్ విషయాన్ని అమెరికాతో గత కొన్నాళ్లుగా చర్చిస్తూనే ఉంది. ఇక 100 శాతం టారిఫ్ ల బిల్లు కార్యరూపం దాలిస్తే.. ఇరు దేశాల సంబంధాల పైనా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మార్కెట్ల్ పైనా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అదే విషయాన్ని అమెరికాకు క్లియర్ గా, క్లారిటీగా చెప్పింది.

ఎవరు ఏమనుకున్నా, ఎన్ననుకున్నా… మన దేశ ప్రయోజనాలు మనకు ముఖ్యం. వీటిని పరిరక్షించడానికి కేంద్రం కచ్చితంగా అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఇక అమెరికా నిర్ణయం వల్ల మన వాణిజ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడినా.. దానిని ఫేస్ చేయడానికి ఇప్పటికే సంబంధిత శాఖలతో, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలతో కలిసి పని చేస్తామని.. మన విదేశాంగ శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపింది. అంటే బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇక ఈ బిల్లుకు.. ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026 అని పేరు పెట్టారు. ఇది ఓ సెనేటర్ పేరు. ఆయన పేరే పెట్టడానికి కారణం ఉంది. అమెరికా రిపబ్లిక్ సెనేటర్ అయిన లిండ్సే గ్రాహం.. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లి ఈ ఏడాది జూలైలో వచ్చారు. అలా అమెరికాకు వచ్చిన మరుసటి రోజే చనిపోయారు. అయితే రష్యాపై కఠిన ఆంక్షలను విధించాలంటూ ఆయనే ఈ బిల్లుపై ఏడాదిగా కసరత్తు చేశారు. మద్దతు కూడగట్టారు. పైగా ట్రంప్ కు బలమైన మద్దతుదారుడు. అందుకే ఆయనకు గౌరవం ఇచ్చేలా.. ఈ బిల్లుకు తన పేరు పెట్టారు.

ఈ బిల్లు వల్ల ట్రంప్ కి ప్రత్యేక అధికారం లభిస్తుంది. రష్యా నుంచి ఏ దేశమైనా సరే.. చమురును కానీ, సహజవాయువులను కానీ కొంటే.. అలాంటి దేశాల పై నూరు శాతం టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఉంటుంది. ఈ బిల్లుపై సంతకం చేయడానికి ట్రంప్ కూడా సిద్ధంగానే ఉన్నారు. సో.. మన దేశంతోపాటు చైనా కూడా ఈ బిల్లు పరిధిలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రపంచమంతా చూస్తోంది. కాకపోతే ఏ దేశంపై ఎంత టారిఫ్ విధించాలి అనేది ఇప్పుడు పూర్తిగా అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లో ఉంటుంది. అందుకే భారత్, చైనా విషయంలో ట్రంప్ నూటికి నూరు శాతం టారిఫ్ విధిస్తారా.. లేక తక్కువ మొత్తంలో విధిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

మన దేశం విషయానికి వస్తే ట్రంప్ కచ్చితంగా నూరు శాతం టారిఫ్ విధిస్తారని చెప్పలేం. ఎందుకంటే.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం వల్ల అక్కడి నుంచి చమురు రావడం కష్టం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు సరఫరా మనకు చాలా అవసరం. లేదంటే.. ఇక్కడి మన ఇంధన అవసరాలు తీరవు. ఆల్రెడీ చమురు సరఫరా తగ్గితే ఎలాంటి సీన్ ఉంటుందో చూశాం. అందుకే మన దేశం కూడా అమెరికా ఆంక్షల విషయంలో స్ట్రాంగ్ గానే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రంప్.. భారత్ కు సానుకూల నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు భారత్ పై ఆంక్షలు విధిస్తే అమెరికాకు ఒనగూరే ప్రయోజనాలు కూడా పెద్ద మొత్తంలో లేవు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాస్త పట్టువిడుపుల ధోరణితో ముందుకు సాగిపోవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే.. మనకు ఇబ్బంది లేనట్టే.

అసలు రష్యాపై అమెరికా.. ఇంతటి కఠినమైన ఆంక్షలకు.. ఎందుకు ఇంట్రస్ట్ చూపించింది అనుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రెయిన్ తో యుద్ధం చేయాలంటే రష్యాకు ఆర్థిక వనరులు భారీగా అవసరం. ఇంధనం నుంచి ఆ దేశానికి ఆదాయం వస్తోంది. అందుకే దానిని తగ్గించేలా చేయడమే అమెరికా వ్యూహం. ఇందులో భాగంగానే.. ఆ దేశ చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తోంది. అలాగే రష్యా టాప్ లీడర్స్ ను లిస్టులో చేర్చింది. ఆర్థిక సంస్థలపై ఫోకస్ పెట్టింది. ఇక అమలులో ఉన్న ఆంక్షలను కాదని.. వాటిని తప్పించుకుని.. ఆయిల్ ను సరఫరా చేసే నౌకల షాడో ఫ్లీట్స్ ట్యాంకర్లనూ జాబితాలో చేర్చింది.

వీటన్నింటినీ కంట్రోల్ చేస్తే.. రష్యా దారికి వస్తుందని అగ్రరాజ్యం ఆశపడుతోంది. దాని కోసమే బిల్లును ప్రతిపాదించడం, అది చట్టసభల్లో నెగ్గడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు రష్యా నుంచి వీటిని కొనడానికి ఎవరు ట్రై చేసినా.. ఆ దేశాలపై వంద శాతం టారిఫ్ వేయడానికి ట్రంప్ కు అధికారం ఉంటుంది. రష్యాపై ఆంక్షలు విధించాలంటే దానిపై ఆంక్షలు విధిస్తే సరిపోతుంది.. మధ్యలో మన దేశం ఏం చేసింది అనుకోవచ్చు. నిజానికి ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తరువాత.. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్ ఒడిదొడుకులకు లోనైంది. ఇతర దేశాల ఆంక్షల ప్రభావం వల్ల ఉన్న ధర కన్నా తక్కువకే.. రష్యా తన చమురును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చవగ్గా వస్తోంది కదా అని.. మనతో పాటు చైనా కూడా అక్కడి నుంచి కొన్నాయి. ఇదే అమెరికాకు కోపం తెప్పించింది. అందుకే బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతినిధుల సభలో.. చైనాతో పాటు మన దేశం పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. బిల్లుపై ట్రంప్ సంతకం పెట్టిన వెంటనే వంద శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్టు కాదు. కాకపోతే.. ఎప్పుడైనా సరే.. నూరు శాతం టారిఫ్ ను విధించే పవర్… అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. సో.. ట్రంప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ దేశం పై అయినా సరే.. వంద శాతం లోపు ఎంత టారిఫ్ అయినా విధించవచ్చు.

మనం రష్యా నుంచి ముడిచమురును కొనుక్కుని.. దాని శుద్ధి చేసుకుని అవసరాల మేరకు వాడుకుంటాం. కాకపోతే కొన్ని ఉత్పత్తులను కూడా ఎక్స్ పోర్ట్ చేస్తాం. దీనివల్ల మనకు లాభమే. కాకపోతే అమెరికా అధ్యక్షుడికి ఇది నచ్చలేదు కాబట్టి.. ఆయనకున్న అధికారం మేరకు టారిఫ్ విధించవచ్చు. దీనిని అమెరికాలో డెమొక్రాట్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ నిర్ణయం మీదే ఇప్పుడు అంతా ఆధారపడి ఉంది. దానిని బట్టి అమెరికా-భారత్ వాణిజ్య బంధం నెక్స్ట్ స్టెప్ తీసుకోనుంది. చివరిలో ఓ ట్విస్ట్ ఏంటంటే.. అందరికీ సుద్దులు చెప్పి తాను మాత్రం పాటించకపోవడం అమెరికాకు మామూలే. ఇప్పుడు కూడా అంతే. రష్యా నుంచి మనతో పాటు మిగిలిన దేశాలను చమురు కొనద్దంటోంది. కానీ అమెరికా మాత్రం యురేనియం కొంటుందట. ఎందుకంటే.. అమెరికాలో జనరేట్ అయ్యే టోటల్ పవర్ లో 20 శాతం అణు విద్యుత్తే. ఒకవేళ యురేనియం సరఫరా ఆగితే.. పవర్ గ్రిడ్ పై ఎఫెక్ట్ తప్బదు. దీంతో తనకు తానే మినహాయింపులు ఇచ్చేసుకుంది. అమెరికా కదా.. ఇలాగే ఉంటుంది మరి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *