Vipraj Nigam: టీమిండియా యంగ్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం ఆయన టీమిండియా తరఫున ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు జపాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇక్కడ లేని సమయంలో, ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న ఆయన నివాసానికి ఒక యువతి వెళ్లడం కలకలం రేపింది. గతంలో విప్రాజ్ నిగమ్ ఈ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించగా, అదే యువతి నేరుగా ఆయన ఇంటికి చేరుకుని బయటే కూర్చోవడం సంచలనంగా మారింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆమె ఇంటికి వచ్చి దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు నిరీక్షించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇంటికి వెళ్లడానికి అసలు కారణం ఏమిటి?
పోలీసు కేసు నమోదైన తర్వాత ఆ యువతి నేరుగా క్రికెటర్ ఇంటికి ఎందుకు వెళ్లిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన ఉద్దేశం ఎవరినీ ఇబ్బంది పెట్టడం గానీ, అక్కడ ఎలాంటి గొడవ సృష్టించడం గానీ కాదని స్పష్టం చేసింది. ఈ వివాదాలన్నింటికీ ఒక ముగింపు పలకాలని, అతడితో డైరెక్టుగా మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్లినట్లు ఆమె వెల్లడించింది. ఆ సమయంలో విప్రాజ్ నిగమ్ ఇంట్లో ఆయన తల్లి మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత క్రికెటర్ తండ్రితో ఆ యువతి ఫోన్ ద్వారా మాట్లాడగా, ఒక వారం రోజుల తర్వాత ఈ విషయంపై మాట్లాడుకుందామని ఆయన చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగింది.
ఈ వివాదానికి అసలు కారణం ఏమిటి?
ఈ మొత్తం వివాదం వెనుక గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆ యువతి తనను వేధిస్తోందని, ఫోన్ చేసి రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరిస్తోందని ఆరోపిస్తూ విప్రాజ్ నిగమ్ గతంలో 2025 నవంబర్ 8న బారాబంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విప్రాజ్ తనపై కేసు పెట్టిన కొద్ది రోజులకే ఆ యువతి కూడా తిరగబడింది. గౌతమ్‌బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో విప్రాజ్‌పై తీవ్రమైన రేప్ ఆరోపణలతో ప్రతి కేసు నమోదు చేసింది.
రేప్ ఆరోపణలు, కెరీర్‌పై ప్రభావం
ఆ యువతి తన ఫిర్యాదులో మాట్లాడుతూ.. తాము ఇంటర్నెట్ ద్వారా 2025 మే నెలలో పరిచయం అయ్యామని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూలై 29న నోయిడాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా తనపై భౌతిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఏషియన్ గేమ్స్‌లో ఆడుతున్న విప్రాజ్ నిగమ్ కెరీర్‌కు ఈ వివాదం అత్యంత కీలకమైన మలుపుగా మారింది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..