హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో సుధా రెడ్డి ఫౌండేషన్, మెయిల్ (MEIL) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ సీజన్ 3.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగిన ఈ రన్‌ను కృష్ణారెడ్డి, సుధారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, క్యాన్సర్ ముందస్తు గుర్తింపు ప్రాధాన్యతను చాటిచెప్పేలా సాగిన ఈ కార్యక్రమంలో 10కే (10K) రన్‌ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషితో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. బాధితులకు అండగా నిలవాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.