కావలసిన పదార్థాలు: అటుకులు – 1 కప్పు, బొంబాయి రవ్వ – 1 కప్పు, పెరుగు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, వంట సోడా – పావు టీస్పూన్, ఉల్లిపాయ – అర ముక్క, వంట నూనె – దోశలు కాల్చడానికి సరిపడా.
టమాటా-కరివేపాకు పల్లీ చట్నీ కోసం: వేరుశనగ గింజలు – అర కప్పు, పచ్చిమిరపకాయలు – 3 నుండి 4, తాజా కరివేపాకు – 1 రెమ్మ, ముక్కలుగా తరిగిన మీడియం సైజు టమాటా – 1, చింతపండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 3 నుండి 4, తాలింపు దినుసులు – 1 టీస్పూన్, ఎండుమిరపకాయలు – 2, వంట నూనె – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకుని నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీటిని పూర్తిగా వంపేయాలి. ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు మరియు 1 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. బౌల్‌పై మూతపెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇది నానా పెట్టేలోపు చట్నీ చేయండి.
టమాటా-పల్లీ చట్నీ తయారీ: అటుకులు నానే లోపు కడాయిలో అర కప్పు పల్లీలు వేసి మీడియం మంటపై లోపలి వరకు కరకరలాడేలా దోరగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇందులో తరిగిన 1 టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించి.. కొద్దిగా చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్క నిమిషం వేపి స్టవ్ ఆఫ్ చేయాలి. పల్లీల పొట్టు తీసి, చల్లారిన టమాటా-పచ్చిమిర్చి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి చట్నీలో కలిపితే కమ్మని చట్నీ సిద్ధం.
15 నిమిషాల తర్వాత బాగా నానిన అటుకులు-రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో సరిగ్గా 1 కప్పు నీళ్లు పోసి ఎక్కడా పలుకు లేకుండా మెత్తటి దోశ పిండిలా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ వంట సోడా వేసి పిండి అంతా బాగా కలిసేలా ఒక నిమిషం కలుపుకోవాలి.
స్టవ్‌పై దోశ పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కతో పెనం అంతా రుద్దాలి. రెండు గరిటెల పిండిని పెనం మధ్యలో పోసి.. పల్చగా తిప్పకుండా గరిటెతో కాస్త మందంగా, గుండ్రంగా తేలికగా సర్దాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే దోశపై అందమైన ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి. దోశ చుట్టూ కొద్దిగా నూనె వేసి పైన మూతపెట్టి 2 నిమిషాలు కాల్చాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి మరో నిమిషం కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
అంతే, నోరూరించే దూదిలాంటి మృదువైన 'ఇన్స్టంట్ స్పాంజ్ దోశలు టమాటా-పల్లీ చట్నీ' సిద్ధం! వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకుని చట్నీతో నంజుకుని తింటుంటే.. పప్పు నానబెట్టాల్సిన శ్రమ లేకుండానే హోటల్ సెట్ దోశ తిన్నంత కమ్మటి అనుభూతినిస్తుంది!






