వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై, నెమలి బిగ్గరగా అరిస్తే చాలు.. వర్షం రాబోతుంది అని భావించడం మనకు తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం. శతాబ్దాలుగా నెమలిని వర్ష సూచికగా భావిస్తూ సాహిత్యంలో కళల్లో వర్ణించారు. కానీ శాస్త్రీయంగా నెమలి నిజంగానే వర్షం రాకను ముందుగానే పసిగట్టగలదా? పరిశోధనలు, జీవశాస్త్రం ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. నెమలి అరుపుకు, వర్షపాతానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. దీని వెనుక ఉన్న అసలు కారణం వర్షం కాదు.. వాటి సహజ ప్రవర్తన, సంతానోత్పత్తి కాలం. భారతీయ నెమళ్లు సహజంగానే ఎక్కువ శబ్దాలు చేసే పక్షులు. మగ నెమళ్లు తమ ఉనికిని చాటుకోవడానికి, ఆడ నెమళ్లు ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు తరచూ బిగ్గరగా అరుస్తుంటాయి.
భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నెమళ్ల సంతానోత్పత్తి కాలం వర్షాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో ఆడ నెమళ్లను ఆకర్షించడానికి మగ నెమళ్లు చాలా చురుగ్గా ఉంటూ, పదేపదే బిగ్గరగా అరుస్తాయి. నెమళ్లు ఎక్కువగా అరిచే సమయమూ, వర్షాలు కురిసే సమయమూ ఒకటే కావడంతో… నెమలి కూత వల్లే వర్షం వస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
మరి పురివిప్పి ఆడే నాట్యం సంగతేంటి?
వర్షం పడే ముందు నెమలి పురివిప్పి నాట్యం చేస్తుందనే అందమైన దృశ్యం మనందరికీ పరిచితమే. అయితే జీవశాస్త్రం ప్రకారం.. ఇది వర్షాన్ని చూసి చేసే నాట్యం కాదు. సంతానోత్పత్తి కాలంలో ఆడ నెమలిని ఆకర్షించడానికి మగ నెమలి తన అందమైన ఈకలను విప్పి ప్రదర్శించే సహజ శృంగార చేష్ట. ఈ కాలం వర్షాకాలంతో సమానంగా రావడం వల్ల అది వర్ష నాట్యంగా స్థిరపడిపోయింది.
పక్షులు వాతావరణాన్ని గ్రహించగలవా?
వాతావరణంలో చోటుచేసుకునే పీడనం, తేమ, ఉష్ణోగ్రతల్లోని మార్పులు పక్షుల కదలికలపై ప్రభావం చూపుతాయన్నది నిజమే. 2024లో యానిమల్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక తేమ ఉన్నప్పుడు కొన్ని పక్షుల శబ్దాల్లో మార్పులు కనిపించాయి. కానీ వాతావరణ పీడనాన్ని పసిగట్టి నెమళ్లు ఉద్దేశపూర్వకంగా వర్ష హెచ్చరిక చేస్తాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు. నెమలి కూతను వాతావరణ శాఖ బులిటెన్‌లా కాకుండా ప్రకృతిలో దాని సహజ ప్రవర్తనగా, సంతానోత్పత్తి సంకేతంగా చూడటమే సరైన శాస్త్రీయ దృక్పథం.