Headlines

నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ.. విపక్షాలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్..

నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ.. విపక్షాలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్..


దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ క్వశ్చన్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తు, విద్యార్థుల ప్రయోజనాల పట్ల అత్యంత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించగా.. దీనిపై స్పందించిన ప్రహ్లాద్ జోషి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు.

చర్చకు సిద్ధం – విపక్షాల వైఖరిపై విమర్శలు

గతంలో పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు చర్చకు ముందుకొచ్చేసరికి కొత్త నిబంధనలు, షరతులు విధిస్తున్నారని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ప్రసంగాల కన్నా విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం. మేము సభలో చర్చకు ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశంలో పారదర్శకమైన పరీక్షా విధానాన్ని పునరుద్ధరించడం, యువత భవిష్యత్తును సురక్షితం చేయడం వికసిత్ భారత్ లక్ష్యాల్లో కీలక భాగమని వెల్లడించారు.

సమూహ ఆలోచనతో పరిష్కారం

పేపర్ లీకేజీల వంటి అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు అందరి ఆలోచనలు, సూచనలు తోడ్పడతాయని, పార్లమెంట్ వేదికగా ఆరోగ్యకరమైన చర్చల ద్వారా బలమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సభను స్తంభింపజేయడం కాకుండా పార్లమెంట్‌లో విపక్షాలు నిర్మాణాత్మక చర్చకు సహకరించాలని, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయం చేయకుండా కఠిన చట్టాల రూపకల్పనకు మద్దతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *