మన సమాజంలో ఇప్పటికీ దంపతులకు సంతానం కలగకపోతే మొదట వేలిత్తి చూపేది మహిళనే.. ఆమె ఆరోగ్య పరిస్థితులు, జాతకాలు, ఆహారపు అలవాట్లపైనే చర్చలు నడుస్తాయి. భర్త మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండా వెయిటింగ్ రూమ్‌కే పరిమితమవుతుంటాడు. కానీ ప్రస్తుత వైద్య విజ్ఞానం, గణాంకాలు చెబుతున్న నిజం వేరు.. వంధ్యత్వ కేసుల్లో దాదాపు సగం లోపాలు పురుషులకే సంబంధించి ఉంటున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓవల్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ కరుణాకరన్ సమగ్రంగా విశ్లేషించారు. సమాజంలో పేరుకుపోయిన అపోహలు, మారుతున్న జీవనశైలి, పురుషుల సంతానోత్పత్తిపై పడుతున్న తీవ్ర ప్రభావం గురించి ఆయన వెల్లడించిన విషయాలు ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తున్నాయి.
భార్యకు ఏళ్ల తరబడి పరీక్షలు.. కానీ భర్తకు?
భారతదేశంలో చాలామంది పురుషులు ఫెర్టిలిటీ క్లినిక్ మెట్లు ఎక్కేది తమ భార్య నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల తరబడి స్కాన్‌లు, హార్మోన్ ఇంజెక్షన్లు, మానసిక వేదన అనుభవించిన తర్వాతే.. తీరా పురుషుడికి స్పెర్మ్ టెస్ట్ చేసే సమయానికే చాలా సమయం, డబ్బు, ఓపిక ఖర్చయిపోతున్నాయి. 1970ల నుంచి వస్తున్న ఐవీఎఫ్ చికిత్సల విధానం కూడా ఎక్కువగా మహిళా శరీరం చుట్టూనే రూపుదిద్దుకోవడం, చాలా క్లినిక్ లలో గైనకాలజిస్టులే ప్రధాన పాత్ర పోషించడం వల్ల పురుషుల ఫెర్టిలిటీ అంశం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు కారణాలేంటి?
ఇరవై ఏళ్ల నుంచి 30 ప్రారంభంలో ఉన్న నగర యువకుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, కణాల నాణ్యత తగ్గడం వంటి సమస్యలను వైద్యులు ఇప్పుడు ఎక్కువగా గమనిస్తున్నారు. దీనికి ప్రధానంగా మారుతున్న జీవనశైలే కారణమని డాక్టర్ సందీప్ వివరించారు.
ఉద్యోగ ఒత్తిడి – కార్టిసాల్: రోజుకు 10 నుండి 12 గంటల పాటు కూర్చొని పనిచేయడం, ఉద్యోగ, ఆర్థిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉండటం.
వృషణాల వద్ద వేడి పెరగడం: ఒళ్లో నిరంతరం ల్యాప్‌టాప్‌లు పెట్టుకోవడం, బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ కణాలు దెబ్బతినడం.
వ్యసనాలు – ఊబకాయం: ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్, పురుగుమందుల అవశేషాలున్న ఆహారం తీసుకోవడం.
ప్రధానంగా కనిపిస్తున్న వైద్య లోపాలు..
- వీర్యకణాల అసాధారణ ఆకృతి
- తక్కువ సంఖ్య, తక్కువ పరిమాణం
- కణాల కదలిక తగ్గడం
- వీర్యం ద్రవ రూపంలోకి మారడానికి ఎక్కువ సమయం పట్టడం
యువత ఆలోచనల్లో మార్పు..
అయితే పట్టణాల్లోని నేటి తరం యువకులు పెళ్లికి ముందే లేదా ప్లానింగ్ వేసుకునే సమయంలోనే స్వచ్ఛందంగా స్పెర్ట్ టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. స్నేహితులు, బంధువులు కారణం తెలియకుండా ఏళ్ల తరబడి ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరగడం చూసినవారు.. సమస్య ఎక్కడుందో ముందే తెలుసుకోవడం మేలని భావిస్తున్నారు. సాధారణ రక్త పరీక్ష తరహాలోనే దీన్ని భావిస్తూ క్లినిక్‌లకు వస్తున్నారు.
మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి..
వీర్య పరీక్ష అనేది చాలా సులభమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దంపతుల్లో మొదట మహిళను మాత్రమే పరీక్షించే పద్ధతి మారాలి. మొదటి రోజే ఇద్దరికీ ఒకేసారి పరీక్షలు చేయాలి.
వంధ్యత్వం అనేది పురుషత్వానికి లేదా స్త్రీత్వానికి ఇచ్చే సర్టిఫికేట్ కాదు. ఇది చికిత్స ద్వార నయం చేయగల ఒక సాధారణ వైద్య పరిస్థితి.