Headlines

దిశ ఘటన స్థలంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యానికి యత్నం..!


హైదరాబాద్‌ మహానగరం శివారులోని శంషాబాద్‌ పరిధిలో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నల్గొండ జిల్లా దేవరకొండలోని శివాజీనగర్‌కు చెందిన ఓ మహిళ సెప్టెంబర్ 26న సాయంత్రం జడ్చర్ల నుంచి హైదరాబాద్‌కు క్యాబ్‌లో బయలుదేరింది. తుండుపల్లి వద్దకు చేరుకున్న తర్వాత డ్రైవర్‌ అకస్మాత్తుగా వాహనం దారి మళ్లించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌ను తీసుకెళ్లిన డ్రైవర్‌.. అక్కడ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అతడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించి, క్యాబ్‌ నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు వేయడంతో డ్రైవర్‌ అక్కడి నుంచి కారుతో వేగంగా పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే మహిళకు చెందిన బ్యాగ్‌ కారులోనే ఉండిపోయింది. అందులో రూ.60 వేల నగదు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ఈ ఘటనపై బాధితురాలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను చూస్తే గుర్తుపట్టగలనని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో తుండుపల్లి టోల్‌ప్లాజా పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. క్యాబ్‌ ప్రయాణానికి సంబంధించిన ఇతర ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన బ్యాగ్‌, అందులోని నగదును తిరిగి ఇప్పించాలని బాధితురాలు పోలీసులను కోరింది. తుండుపల్లి పరిసర ప్రాంతం 2019లో జరిగిన దిశ హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. నవంబర్‌ 27న శంషాబాద్‌కు చెందిన వెటర్నరీ వైద్యురాలు తన ద్విచక్ర వాహనాన్ని తుండుపల్లి వద్ద నిలిపి వెళ్లిన అనంతరం తిరిగి అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమె వాహనం టైర్‌లో గాలి తీసి, సాయం చేస్తామనే నెపంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అక్కడ ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని లారీలో తరలించి చటాన్‌పల్లి సమీపంలోని వంతెన కింద దహనం చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నవంబర్‌ 28న మృతదేహాన్ని గుర్తించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అదే ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో తాజాగా మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *