Headlines

బ్రెడ్, జామ్ తిన్న తర్వాత విషాదం.. తండ్రి మృతి, ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత!


కేరళలోని త్రిశూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బ్రెడ్, జామ్ తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన 60 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనతో కలిసి అదే ఆహారం తీసుకున్న ఇద్దరు కుమార్తెలు కూడా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్ జిల్లా పళయన్నూర్ ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ శనివారం (సెప్టెంబర్ 26) రాత్రి తన ఇద్దరు కుమార్తెలు విద్య, వృందతో కలిసి ఇంట్లో బ్రెడ్, జామ్ తిన్నారు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ముగ్గురికీ వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో వారిని ఒట్టప్పాలంలోని వల్లువనాడ్ ఆస్పత్రికి తరలించారు.

వినోద్ కుమార్ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటలకు ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన కుమార్తెల్లో ఒకరు చికిత్స అనంతరం ఇంటికి వెళ్లగా, మరో కుమార్తెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ముగ్గురూ ఒకే ఆహారం తీసుకున్న అనంతరం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆహారం కలుషితమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వినోద్ కుమార్ మృతికి అసలు కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు అంతర్గత అవయవాల నమూనాలను శాస్త్రీయ పరీక్షలకు పంపనున్నట్లు సమాచారం. పోస్టుమార్టం, పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే మృతికి కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *