మారుతున్న కాలానుగుణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న వారికి.. అలానే వాటి కోసం ప్లాన్ చేస్తున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా తీపి కబురు ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పిస్తూ ‘బీవోబీ గ్రీన్ ప్లగ్ ఫైనాన్సింగ్ స్కీమ్’ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారికి రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనుంది.
ఎవరు అర్హులు..
కొత్తగా చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలనుకునే వారితో పాటు, ఇప్పటికే ఉన్న కేంద్రాలను ఆధునీకరించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి సన్నాహాలు చేస్తున్న వారు ఈ పథకానికి అర్హులు. ముఖ్యంగా ఈవీ రంగంలో అడుగుపెడుతున్న స్టార్టప్‌లు, చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లు, ఎలక్ట్రిక్ ఫ్లీట్ ఆపరేటర్లు ఈ స్కీమ్ వినియోగించుకోవచ్చు. అలానే అదనపు ఆదాయ మార్గాల కోసం చార్జింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే కేఫెటేరియాలు, వాష్‌రూమ్‌లు వంటి కనీస యుటిలిటీల నిర్మాణానికి కూడా ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలాంటి అనుబంధ సదుపాయాల కోసం మంజూరైన మొత్తం లోన్‌లో 25 శాతం లేదా రూ.కోటి (వీటిలో ఏది తక్కువైతే అది) మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది.
వడ్డీ రేట్లు.. 10 ఏళ్ల రీపేమెంట్ గడువు
ఈ రుణాలపై వార్షిక వడ్డీ రేటు 8.15 శాతం నుంచి 9.60 శాతం మధ్య ఉంటుందని వెల్లడించారు. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (BRLLR), రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, తీసుకునే మొత్తాన్ని బట్టి తుది వడ్డీ రేటు ఖరారవుతుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు బ్యాంక్ ఏకంగా 120 నెలల (10 ఏళ్ల) సుదీర్ఘ గడువును ఇస్తోంది. అంతేకాకుండా ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉండే ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు గరిష్ఠంగా 12 నెలల పాటు మారటోరియం (వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేని కాలం) వెసులుబాటును కూడా కల్పించడం విశేషం.
సోలార్ చార్జింగ్.. కొలేటరల్ ఫ్రీ రుణాలు
మరోవైపు పర్యావరణ హితమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌తో నడిచే ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక అండనిస్తోంది. ఇక హామీ (Collateral) విషయానికి వస్తే.. అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు (MSMEs) ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్’ (CGTMSE) కింద గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది. దీనివల్ల ఆస్తులు తాకట్టు పెట్టే ఇబ్బంది లేకుండానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాన్ని ప్రారంభించే వీలుంటుంది.