కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, ఉప్పు 3 చిటికెలు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె 1 చిన్న గరిటెడు, ఎండు కొబ్బరి తురుము 2న్నర కప్పులు, సన్నని చక్కెర ముప్పావు కప్పు, యాలకుల పొడి తగినంత, మైదా పిండి కొద్దిగా, నీళ్లు సరిపడా.
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి, మూడు చిటికెలు ఉప్పు, ఒక చిన్న గరిటెడు నూనె వేసి పిండికి నూనె బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పూరీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిపై కొద్దిగా నూనె రాసి, తడి బట్ట కప్పి మూతపెట్టి బాగా నాననివ్వాలి. పిండి ఎంత చక్కగా నానితే కజ్జికాయలు అంత గుల్లగా, మృదువుగా వస్తాయి.
ఈ లోపు లోపల పెట్టే స్టఫింగ్ కోసం సన్నని రంధ్రాలున్న గ్రేటర్‌తో ఎండు కొబ్బరిని సన్నగా, పొడవుగా తురుముకోవాలి. రెండున్నర కప్పుల ఎండు కొబ్బరి తురుములో ముప్పావు కప్పు సన్నని చక్కెర, మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసి చేత్తో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు నానిన గోధుమ పిండిని మరోసారి బాగా మర్దన చేసి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండకు ఒకవైపు మాత్రమే కొద్దిగా పొడి మైదా పిండి అద్ది, ఆ వైపు పైకి ఉండేలా ఉంచి పలుచని పూరీలా ఒత్తుకోవాలి. అన్ని కజ్జికాయలు ఒకే ఆకారంలో రావడానికి ఒక గుండ్రని డబ్బా మూతతో కట్ చేసుకోవాలి. పొడి పిండి అద్దిన వైపు పైకి ఉండేలా తీసుకుని, మధ్యలో కొద్దిగా కొబ్బరి మిశ్రమం పెట్టి, అంచులను గట్టిగా ఒత్తుతూ మూసేయాలి. ఇలా చేయడం వల్ల నూనెలో వేయించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి.
తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత కజ్జికాయలను వేసి, రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు నిదానంగా వేయించి తీసుకోవాలి. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచితే వారం రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి.




