Headlines

టీవీ యాంకర్‌కు మరణశిక్ష ! డ్రగ్స్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు


 డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కైరో  కోర్టు మరణశిక్ష విధించింది. కైరో క్రిమినల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. సారా ఖలీఫా మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, అక్రమ రవాణా చేస్తున్నట్లు అభియోగాలు రుజువయ్యాయి. పోలీసులు దాడులు చేసి సుమారు 750 కిలోలకు పైగా డ్రగ్స్, ముడి పదార్థాలు, అలాగే అనుమతి లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కొన్ని అపార్ట్‌మెంట్లను ల్యాబ్ లాగా మార్చినట్లు గుర్తించారు.

ఈ కేసులో సారా ఖలీఫా గత ఏడాది ఏప్రిల్‌లోనే అరెస్టయ్యారు. ‘అల్-అహ్రామ్’ పత్రిక  ప్రకారం, ఈ కేసులో 20 మంది సాక్షుల వాంగ్మూలాలను ప్రాసిక్యూటర్లు ఆధారాలుగా చూపించారు. నేరస్తుల ముఠా కార్యకలాపాలను ధృవీకరించే మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.

ఈ తీర్పును గత నెలలోనే ప్రకటించినప్పటికీ, ఈజిప్టు మత పెద్ద దీనిపై తన మతపరమైన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాతే అధికారికంగా ఖరారు చేసారు. ఈజిప్టులో మరణశిక్ష విధించే కేసుల్లో మతపెద్ద ఆమోదం తెలపడం లేదా అభిప్రాయం చెప్పడం ఒక తప్పనిసరి చట్టపరమైన ప్రక్రియగా కొనసాగుతోంది.

తనపై వచ్చిన ఆరోపణలను సారా  ఖలీఫా పూర్తిగా ఖండించారు. తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, కనీసం సిగరెట్‌ కూడా ముట్టలేదని కోర్టులో తెలిపారు. విచారణ సందర్భంగా సారా ఖలీఫా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనను క్షమించాలని వేడుకున్నట్లు ఈజిప్టు మీడియా వెల్లడించింది. “దయచేసి నా మాట వినండి. మా అమ్మనాన్న నన్ను పద్ధతిగా పెంచారు. నాకు డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బు అవసరం లేదు” అని ఆమె కోర్టులో ప్రాధేయపడ్డారు. తాజాగా కోర్టు మరణశిక్ష విధించడంతో, ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

ఎవరీ సారా ఖలీఫా?

ఈజిప్టుకు చెందిన సారా ఖలీఫా స్థానికంగా ప్రసిద్ధ టెలివిజన్‌ ప్రజెంటర్‌. నేరాలు, భద్రత అంశాల ఆధారంగా ప్రసారమయ్యే ‘మిషన్ ఇంపాజిబుల్’ ప్రోగ్రామ్ కి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. టెలివిజన్‌ రంగంలో యాంకర్ గా ఉన్న సారాకు  ఒక కాస్మెటిక్‌ సర్జరీ క్లినిక్‌, ఈవెంట్లు, పార్టీలను నిర్వహించే సొంత ప్రొడక్షన్‌ కంపెనీ కూడా ఉంది. సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 25 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఈజిప్టులో ఉగ్రవాదం, హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధిస్తారు. డ్రగ్స్‌ కేసుల్లో కూడా మరణదండన విధించడాన్ని అక్కడి మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మరణశిక్షను కేవలం ఉద్దేశపూర్వక హత్యలకు మాత్రమే పరిమితం చేయాలని  మానవ హక్కుల సంఘాలు  వాదిస్తున్నాయి. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఒక్క 2025 సంవత్సరంలోనే ఈజిప్టు కోర్టులు 492 మరణశిక్షలు విధించగా, వాటిలో 23 శిక్షలను అమలు చేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *