Headlines

చలికాలంలో పల్లీలను ఎలా తినాలి..? ఈ 4 తప్పులు చేస్తే మొదటికే మోసం..


చలికాలంలో పల్లీలను ఎలా తినాలి..? ఈ 4 తప్పులు చేస్తే మొదటికే మోసం..

చలికాలం మొదలవగానే పల్లీలకు గిరాకీ బాగా పెరుగుతుంది. కొందరు వేడివేడిగా వేయించిన పల్లీలను కరకరలాడుతూ తినడానికి ఇష్టపడితే, మరికొందరు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. తక్కువ ధరకే లభించే వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్-ఇ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా కడుపు నిండిన భావనను కలిగించి తరచూ ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి. అయితే పల్లీలను నానబెట్టి తినడం మంచిదా లేక వేయించి తినడం మేలా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

నానబెట్టిన వేరుశెనగలతో లాభాలేంటి?

పల్లీలను సుమారు 8 గంటల పాటు నీటిలో నానబెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరం ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. అంతేకాకుండా ఇవి మెత్తగా ఉండి నమలడానికి, జీర్ణం కావడానికి ఎంతో తేలికగా ఉంటాయి. అయితే, వీటిని శుభ్రమైన నీటిలో నానబెట్టాలి, నానబెట్టిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే తినేయాలి.

వేయించిన వేరుశెనగల ప్రత్యేకత ఏంటి?

వేయించిన వేరుశెనగల్లో తేమ ఉండదు కాబట్టి అవి కరకరలాడుతూ మంచి రుచి, సువాసనను అందిస్తాయి. 2024లో ఫుడ్ సైన్స్ – న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వేరుశెనగలను వేయించడం వల్ల కొన్ని పోషకాల్లో స్వల్ప మార్పులు వచ్చినా, ప్రోటీన్ పరిమాణంలో మాత్రం పెద్దగా మార్పు ఉండదని తేలింది. కానీ వీటిని మరీ ఎక్కువ వేడి మీద లేదా ఎక్కువసేపు వేయించకూడదు. ముఖ్యంగా నూనె, ఉప్పు వేసి వేయించిన పల్లీలను రోజూ అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

రెండింటిలో ఏది ఎంచుకోవాలి?

నానబెట్టినవి, వేయించినవి.. రెండింటిలోనూ వాటి వాటి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. మీకు సులభంగా జీర్ణమయ్యేవి, ఖనిజాలు బాగా అందేవి కావాలంటే నానబెట్టిన వేరుశెనగలను ఎంచుకోవచ్చు. ఒకవేళ మంచి రుచి, నిల్వ చేసుకునే సౌలభ్యం కావాలంటే వేయించిన పల్లీలు సరిపోతాయి. ఏది ఎక్కువ పోషకమైనదనే దానికంటే, మీ శరీర తత్వానికి ఏది సరిపడుతుందో గమనించి మితంగా తీసుకోవడం ఉత్తమం.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • వేరుశెనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
  • ఉప్పు కలిపిన వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి.
  • తేమ చేరిన లేదా బూజు పట్టిన వేరుశెనగలను పొరపాటున కూడా తినకూడదు.
  • వేరుశెనగ అలెర్జీ ఉన్నవారు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి, లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *