మీనాక్షి చౌదరి.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుశాంత్ హీరోగా ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజతో నటించిన ఖిలాడీ మూవీ ఫ్లాప్ అయినా.. అడివి శేష్‌తో చేసిన “హిట్ 2” మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “గుంటూరు కారం” చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అదే ఊపులో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలతో భారీ హిట్స్ అందుకుంది.
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన “వృషకర్మ” చిత్రంలో నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి సుకుమార్ కథా సహకారం అందించారు. మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శ్రీవాస్తవ విలన్ గా నటిస్తున్నారు. అలానే మలయాళ సీనియర్ నటుడు జయరామ్, సత్య, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
చాలా సినిమాలు రిజక్ట్ చేశా..
లక్కీ భాస్కర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత తనకు వచ్చిన కథలన్నీ దాదాపు తల్లి పాత్రల చుట్టూ తిరిగేవే అని మీనాక్షి ఓపెన్ అయ్యారు. నటిగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతోనే.. అలాంటి కథలన్నింటికి నో చెప్పానని స్పష్టం చేశారు. ఒకే తరహా పాత్రలకు పరిమితమైతే నటిగా తన కెరీర్ దెబ్బతింటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. కేవలం గ్లామర్, ఎమోషనల్ రోల్స్‌కే పరిమితం కాకుండా.. ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాలో నటించాలనేది తన డ్రీమ్ అని వెల్లడించారు. అందుకోసమే జిమ్‌లో ఎంఎంఏ, ముయే థాయ్ వంటి కఠినమైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి ఒక సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నట్లు మీనాక్షి వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించి తన భాగపు షూటింగ్ ఇప్పటికే 60 శాతం ఫినిష్ అయ్యిందని తెలిపారు. అలానే సిద్ధు జొన్నలగడ్డ-వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నట్టు రివీల్ చేశారు. ఇక లక్కీ భాస్కర్ సినిమాకు ఓపెన్ ఎండింగ్ ఉందని.. అందుకే సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని డైరెక్టర్ వెంకీ చెప్పినట్టు అభిప్రాయపడ్డారు.