Headlines

చలికాలంలో ఈ బిజినెస్‌లతో భారీ లాభాలు పక్కా.. కేవలం లక్ష లోపు పెట్టుబడితోనే !!


ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో ఇచ్చే చల్లని కానుకే “శీతాకాలం”. ఎండ వేడి, వానల హడావిడి నుంచి ఉపశమనం ఇచ్చే ఈ కాలంలో భూమిని తెల్లని మంచు దుప్పటి కప్పేసిందా అనేలా మారిపోతుంది. మరీ ముఖ్యంగా వేకువజాము నుంచే పొగమంచు కమ్ముకోవడం.. ఆ మంచు తెరలను చీల్చుతూ వచ్చే సూర్యకిరణాలు చూడడానికి భలే అనిపిస్తాయి. అలానే చలికాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో మాత్రమే కాకుండా మనుషుల అవసరాలు, జీవనశైలిలో కూడా మార్పు వస్తుంది.

సాధారణంగా ధరించే బట్టల నుంచి చలిని తట్టుకునే ఉన్ని దుస్తులకు మారిపోతాం. అలానే స్వెటర్లు, జాకెట్ల వాడకం మళ్లీ పెరుగుతోంది. అందుకే లక్ష రూపాయల లోపు బడ్జెట్‌తో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్న వారికి వింటర్ సీజన్ చక్కటి అవకాశాలను అందిస్తుంది. తక్కువ పెట్టుబడితోనే కళ్లు చెదిరే లాభాలు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏ సీజన్‌లో ఏది డిమాండ్‌లో ఉంటుందో గుర్తించి అడుగు వేస్తే చాలని చెబుతన్నారు. ఈ చలికాలంలో తక్కువ బడ్జెట్ లోనే లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

చలికాలంలోన చేయాల్సిన బెస్ట్ బిజినెస్‌లు ఇవే..

స్వెటర్లు, జాకెట్లు..

చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఉన్ని దుస్తులు, స్వెటర్లు, జాకెట్లకు డిమాండ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుతుంది. ఈ బిజినెస్ కోసం హోల్‌సేల్ మార్కెట్ల నుంచి రకరకాల డిజైన్లలో నాణ్యమైన ఉన్ని దుస్తులను తక్కువ ధరకు సేకరించాలి. వాటిని స్థానిక మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి లేదా ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు విక్రయించవచ్చు.

రూమ్ హీటర్లు, గీజర్ల రిపేర్లు..

చలికాలంలో వేడి నీటి కోసం గీజర్లు, గదిని వెచ్చగా ఉంచుకునేందుకు రూమ్ హీటర్ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా మూలన పడిన ఈ ఎలక్ట్రిక్ పరికరాలు ఒక్కసారిగా ఆన్ చేయడంతో సాంకేతిక సమస్యలు తలెత్తడం సహజం. అందుకే డోర్-స్టెప్ రిపేర్ సర్వీసులు అందిస్తే కస్టమర్లను సులభంగా ఆకర్షించవచ్చు.

పెళ్లి పత్రికలు, రిటర్న్ గిఫ్ట్‌లు..

మన దేశంలో చలికాలం అంటేనే పెళ్లిళ్ల సీజన్ సందడి ఊపందుకుంటుంది. శుభలేఖల ముద్రణతో పాటు పెళ్లిళ్లకు వచ్చే అతిథుల కోసం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌లు, ప్రత్యేక వస్తువుల సేవలకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చిన్న స్థాయి ప్రింటింగ్ సెటప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా లేదా స్థానిక ప్రెస్‌లతో టైఅప్ అయి ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.

వేడి వేడి ఆహారం, టీ స్టాల్స్..

ఉదయం, సాయంత్రం వేళల్లో ఎముకలు కొరికే చలికి వేడి వేడిగా చాయ్, కాఫీ, సూప్‌లు, వేడి స్నాక్స్ లాంటివి లాగించేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. ఆఫీసులు, కాలేజీలు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల సమీపంలో శుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఒక చిన్న టీ స్టాల్ లేదా ఫుడ్ కార్ట్ ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఆదాయం పొందొచ్చు.

దుప్పట్లు, రగ్గుల వ్యాపారం..

చలి పెరుగుతున్న కొద్దీ ప్రతి ఇంట్లోనూ దుప్పట్లు, రగ్గుల అవసరం కచ్చితంగా ఏర్పడుతుంది. మిగతా కాలాలతో పోలిస్తే ఈ మూడు, నాలుగు నెలలు వీటికి డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంటుంది. కుటుంబాలు, బ్యాచిలర్లు, హాస్టళ్లలో ఉండేవారి నుంచి భారీగా ఆర్డర్లు వస్తాయి. సీజనల్ డిమాండ్‌కు తగ్గట్టు స్టాక్‌ను సర్దుబాటు చేసుకుంటే నష్టపోయే అవకాశమే ఉండదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *